బంగారం కొనుగోలు చేయాలన్నా, బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్నా భారతీయులకు అక్షయ తృతీయ ఎంతో ముఖ్యమైన రోజు. బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం దేశ వ్యాప్తంగా నగల దుకాణాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి.
ఏప్రిల్ 21 (మంగళవారం) జరుపుకోనున్న ఈ అక్షయ తృతీయ కోసం బంగారు షాపుల యజమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కారణం అక్షయ తృతీయ సందర్భంగా దేశంలోని బంగారు ఆభరణాల విక్రాయలు గరిష్ఠంగా 25 శాతం వరకు పెరుగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశారు.
ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిన బంగారం ధరలు గడిచిన కొద్ది రోజుల నుంచి కాస్త అటు, ఇటుగా అయినప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలు పుంజుకునేందుకు దోహదపడనున్నాయని భావిస్తున్నారు.
2015 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి సావరిన్ గోల్డ్ బాండ్‌లపై వడ్డీ రేటుని పెంచిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం భౌతిక బంగారాన్ని కొనుగోలు నుండి పెట్టుబడిదారులు మాన్పించడానికేనని అంటున్నారు.

బంగారంలో పెట్టుబడి నిజంగా విలువేనా?
ఆస్తి కేటాయింపు ప్రణాళికల్లో భాగంగా ఈక్విటీలు, భూమి, బంగారం తదితరాలపై పెట్టుబడులు పెట్టే భారతీయులు దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే మార్గాల్లో బంగారం ఒకటని నమ్ముతారు. ఇది ఇలా ఉంటే, గత ఏడాది అక్షయ తృతీయ రోజున బంగారంపై పెట్టిన పెట్టుబడికి కనీస వడ్డీని కూడా అందించక పోగా ధర 8.4 శాతం తగ్గింది.
గడచిన మూడేళ్లుగా బంగారం పరిస్ధితి ఇలాగే ఉంది. 2012లో బంగారం రూ. 31,799 వద్ద ట్రేడ్ అయితే 2015లో రూ. 26,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర $1,204. దీనిని బట్టి చూస్తే, బులియన్ మార్కెట్లో బంగారం మరింతగా రిస్క్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, ప్రపంచ మార్కెట్లు ముందడుగు వేస్తాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతాయి. భారీగా పతనం కాకపోయినా, బంగారం పెరుగుదల ఏమంత ఎక్కువగా ఉండదని నిపుణులు భావిస్తున్నారు.
2003 నుంచి 2012వరకూ పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఆ తర్వాత తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బంగారం కోనుగోలు చేయడం అంత మంచిదికాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారంపై మోడీ ప్రభుత్వం తీసుకున్న దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం అమల్లోకి వస్తే, దేశవాళీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ. 23,000 కంటే తక్కువగా దిగిస్తోందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications