ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ అంటే ఏమిటి?

ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ పాత్ర
భారతదేశంలో సరుకుల మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఏకైక సంస్థ ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. సరుకుల కార్యకలాపాలను నియంత్రించేందుకు కమిషన్ అనేక చర్యలను చేపడుతుంది. వాటిలో..
1. సరుకుల కార్యకలాపాలను నియంత్రించడంతో వాటికి సంబంధించిన సంస్థలకు గుర్తింపు నివ్వడం లేదా ఉపసంహరించుకోవడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ తగు న్యాయ సలహాలను చేస్తుంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ (రెగ్యూలేషన్) యాక్ట్ 1952 ప్రకారం కమిషన్ పరిపాలనకు సంబంధించిన సలహాలను ప్రభుత్వానికి చేస్తుంది.
2. మార్కెట్, సంస్థల కార్యకలాపాల విస్తృతికి తగిన సమయంలో సరైన సలహాలను ఎఫ్ఎంసి చేస్తుంది.
3. సరుకుల కార్యకలాపాలకు సంబంధించిన సంస్థలను పర్యవేక్షించడంతోపాటు అవసరమని భావించినట్లయితే సంస్థల ఖాతాలకు సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను కమిషన్ పరిశీలిస్తుంది. సంస్థల సభ్యులను కూడా వ్యవహారాలకు సంబంధించి విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది.
4. ఫార్వర్డ్ సరుకుల మార్కెట్ కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, విశ్లేషణాత్మక నిర్ణయాలతో మార్కెట్ అభివృద్ధికి కావాల్సిన చర్యలను కమిషన్ చేపడుతుంది.
5. వాణిజ్య పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పబ్లిష్ చేస్తుంది. వివిధ రకాల సరుకుల డిమాండ్, పంపిణీకి సంబంధించిన వివరాలను అన్ని వర్గాలకు అందజేస్తుంది.
మొదటిసారిగా నేషనల్ స్పాట్ ఎక్సేంజి లిమిటెడ్ కుంభకోణం గత నెలలో చోటు చేసుకున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. మనీలాండరింగ్ కార్యకలాపాలు, సంక్షోభ నివారణకు చేపట్టిన మోసపూరిత గిడ్డంగి విధానాలను ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ బయటపెట్టింది. సంబంధిత విభాగాలతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)కి కుంభకోణానికి సంబంధించిన నివేదికలను కమిషన్ అందజేసింది. కమిషన్ బాధ్యతయుతంగా వ్యవహరించడం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. మార్కెట్లలో మోసాలు జరగకుండా ఉండేందుకు ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications