14 ఏళ్లలో కోటి రూపాయల పన్ను చెల్లించానని.. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఎలాంటి నాకు మద్దతు లభించలేదని ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన వైరల్ అవుతోంది. భారతదేశంలో పన్ను చెల్లింపుదారులకు లభించే సామాజిక భద్రత (Social Security), ప్రభుత్వ సౌకర్యాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ ఇదని చెప్పుకోవచ్చు.

Advertisement

తన 14 ఏళ్ల కెరీర్‌లో దాదాపు రూ. 1 కోటి వరకు ఆదాయపు పన్ను చెల్లించిన మహమ్మద్ నౌసత్ అనే నిపుణుడు.. తాను ఉద్యోగం కోల్పోయిన సమయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు లభించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి లభించకపోగా.. తన ఉద్యోగ విరమణ పరిహారంపై కూడా పన్ను విధించడం పట్ల ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేసిన ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక భద్రత, పన్ను విధానాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

Advertisement

నౌసత్ ప్రతిపాదన ప్రకారం.. క్లిష్ట సమయంలో పన్ను చెల్లింపుదారులకు కనీసం 3 నుండి 6 నెలల పాటు పన్ను మినహాయింపుతో కూడిన వేతనం లేదా వారు చెల్లించిన పన్నులలో కొంత భాగాన్ని ఆర్థిక సాయంగా అందించే వ్యవస్థ ఉండాలి. కెనడా, ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగ సమయాల్లో పౌరులకు లభించే ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా పలువురు యూజర్లు ప్రస్తావించారు. ఆయా దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో అధిక పన్నులు చెల్లిస్తున్నప్పటికీ పన్ను చెల్లింపుదారులకు తిరిగి లభించే ప్రతిఫలాలు లేదా భద్రత శూన్యమని విమర్శకులు వాదిస్తున్నారు.

Advertisement
వ్యవసాయ భూమి అమ్మితే పన్ను పడుతుందా.. గ్రామీణ, పట్టణ భూములపై పన్ను నిబంధనలు ఎలా ఉంటాయి..

అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర నిధులు (Emergency Funds) సిద్ధం చేసుకోవడం, పన్నులు ఆదా చేసుకునేందుకు EPF, NPS వంటి సౌకర్యాలను ఉపయోగించుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత బాధ్యత అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనికి సమాధానంగా నౌసత్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

నిరుద్యోగ సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వడం కుదరకపోతే.. కనీసం చెల్లిస్తున్న పన్నులకు ప్రతిఫలంగా పిల్లలు ఆడుకోవడానికి పచ్చని ప్రదేశాలు, సురక్షితమైన ఫుట్‌పాత్‌లు, మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యాలు వంటి ప్రాథమిక ప్రజా మౌలిక సదుపాయాలనైనా నాణ్యంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన భారతదేశంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను, సామాజిక భద్రతా వ్యవస్థ ఆవశ్యకతను మరొకసారి తెరపైకి తెచ్చింది.

Advertisement

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.