భారత ప్రయాణికులకు అత్యంత ఇష్టమైన పర్యాటక గమ్యస్థానాలలో ఒకటైన థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లేవారికి బిగ్ అలర్ట్. ఎవరైనా టూర్ ప్రణాళిక వేసుకునేవారు ఇకపై తమ ప్రయాణానికి ముందు ప్రవేశ నిబంధనలపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్ల కోసం థాయ్‌లాండ్ ప్రభుత్వం తన వీసా రహిత (Visa-Free) ప్రవేశ కార్యక్రమాన్ని ముగించిన నేపథ్యంలో.. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) జూలై 2న ఒక ముఖ్యమైన Advisory జారీ చేసింది. దేశంలోకి ప్రవేశించే సమయంలో ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు భారతీయ పౌరులు తమ వెంట ఉంచుకోవాల్సిన పత్రాలు, నిబంధనల వివరాలను ఇందులో స్పష్టంగా పొందుపరిచారు.

Advertisement

భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చేరుకునే తేదీ నాటికి ప్రయాణికుల పాస్‌పోర్ట్‌కు కనీసం ఆరు నెలల చెల్లుబాటు గడువు (Validity) తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటు ధృవీకరించబడిన తిరుగు ప్రయాణ విమాన టిక్కెట్లు (Confirmed Return Tickets), పర్యటన ముగిసేవరకు హోటల్ బుకింగ్ పత్రాలు, స్పష్టమైన ప్రయాణ ప్రణాళిక (Itinerary) రికార్డులను కలిగి ఉండాలి. ముఖ్యంగా, ప్రయాణికులు థాయ్‌లాండ్‌కు చేరుకోవడానికి 72 గంటల ముందుగానే 'థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్' (TDAC)ను ఆన్‌లైన్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత ఒక క్యూఆర్ (QR) కోడ్ రూపొందుతుంది, దీనిని ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో అధికారులు పరిశీలిస్తారు.

Advertisement

వీసా, ఆర్థిక నిధుల పరంగా కూడా రాయబార కార్యాలయం పటిష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ప్రయాణికులు తమ పర్యటన ఉద్దేశ్యానికి తగిన వీసాను ముందే పొందాలి. ఒకవేళ వీసా మినహాయింపు లేదా వీసా ఆన్ అరైవల్ (VOA) సౌకర్యాన్ని ఉపయోగించుకునే పర్యాటకులు అయితే.. ప్రవేశ తనిఖీల సమయంలో తగినంత ఆర్థిక నిధులు ఉన్నట్లు నిరూపించుకోవడానికి ప్రతి ప్రయాణికుడు తన వెంట కనీసం 20,000 థాయ్ బాట్ (THB) (భారత కరెన్సీలో సుమారు రూ. 57,446) నగదును తప్పనిసరిగా ఉంచుకోవాలి. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ నిధుల రుజువును చూపమని అడిగే అవకాశం ఉంది.

Advertisement

మరోవైపు, Thailand లో ఉద్యోగ అవకాశాలు పొంది వెళ్లేవారికి ఈ సలహా పత్రం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉపాధి నిమిత్తం వెళ్లేవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ పర్యాటక హోదాలో లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో దేశంలోకి ప్రవేశించకూడదని, ఇది స్థానిక వలస నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొంది. అటువంటి ప్రయాణికులు ముందే తగిన అధికారిక వర్కింగ్ వీసాను పొందాలి. అలాగే, థాయ్‌లాండ్ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే (ట్రాన్సిట్) ప్రయాణికులు కూడా తమ తుది గమ్యస్థానానికి సంబంధించిన తదుపరి ప్రయాణ పత్రాలను మరియు ఆయా దేశాలకు అవసరమైన వీసాలను తమ వెంట సిద్ధంగా ఉంచుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.