దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని అంగుల్ జిల్లా తాల్చేర్‌లో 1969 జూన్ 26న జన్మించిన ఆయన.. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో పల్లాహర నుండి ఒడిశా శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఆయన.. ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజీనామా వార్తల నేపథ్యంలో, ఆయన ఎన్నికల సమయం సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ప్రధాన్ కుటుంబ ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.

Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన కుటుంబానికి మొత్తం రూ. 6.90 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా, రూ. 52 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులను మినహాయించిన తర్వాత వారి కుటుంబం యొక్క మొత్తం నికర ఆస్తి విలువ రూ. 6.38 కోట్లుఉంది. ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగత చరాస్తుల విలువ రూ. 1.39 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 92 లక్షలుగా ఉంది. ఆయనకున్న రూ.32 లక్షల అప్పును తీసివేస్తే.. ఆయన నికర ఆస్తి విలువ రూ. 1.99 కోట్లుగా తేలింది.

Advertisement

ఇక ఆయన భార్య మృదుల ప్రధాన్ పేరిట రూ. 2.95 కోట్లు చరాస్తులు.. రూ. 1.37 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆమెకున్న రూ. 20 లక్షల అప్పును మినహాయిస్తే నికర ఆస్తి రూ.4.12 కోట్లుగా నమోదైంది. ప్రధాన్ దంపతుల సంతానంలో కుమార్తె నైమిషా ప్రధాన్ పేరిట రూ. 25 లక్షలు చరాస్తులు ఉండగా, కుమారుడు నిశాంత్ ప్రధాన్ పేరిట రూ. 1.5 లక్షలకు పైగా చరాస్తులు మాత్రమే ఉన్నాయి. వీరిద్దరికీ ఎలాంటి స్థిరాస్తులు లేదా బాధ్యతలు లేవు.

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా డీకే శివకుమార్..తరువాత ఇద్దరూ మన దక్షిణాది ముఖ్యమంత్రులే..
Advertisement

వార్షిక ఆదాయం, నగదు నిల్వల విషయానికి వస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ. 2.74 లక్షలుగా నమోదైంది. అదే సమయంలో ఆయన భార్య మృదుల ఆదాయం రూ. 4.90 లక్షలు కాగా.. కుమార్తె నైమిషా ఆదాయం రూ. 4.60 లక్షలుగా ఉంది. చేతిలో ఉన్న నగదు పరంగా చూస్తే.. ప్రధాన్ వద్ద రూ. 35 వేలు, ఆయన భార్య వద్ద రూ. 40 వేలు ఉన్నాయి. అలాగే కుమార్తె వద్ద పది వేల రూపాయలు.. కుమారుడి వద్ద ఏడు వేల రూపాయల నగదు లభ్యత ఉన్నట్లు అఫిడవిట్ స్పష్టం చేస్తోంది.

Advertisement

ఆర్థిక పెట్టుబడులను పరిశీలిస్తే.. ప్రధాన్ కుటుంబం తమ నిధులను ప్రధానంగా బ్యాంకు పొదుపు ఖాతాలు, ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌లలో సురక్షితంగా ఉంచింది. ఈ రూపంలో వారి వద్ద సుమారు రూ. 2.47 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ. 80.40 లక్షలు విలువైన మ్యూచువల్ ఫండ్లలోనూ, రూ. 67.72 లక్షలు విలువైన వివిధ బీమా పాలసీలలోనూ పెట్టుబడులు పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ తన భార్యకు రూ. 10 లక్షలు వ్యక్తిగత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు వెల్లడైంది.

స్థిరాస్తుల పరంగా ప్రధాన్‌కు ఒడిశాలో రూ. 12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ. 20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయి. నివాస భవనాల విషయానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్యకు కలిపి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఇందిరాపురంలో అపార్ట్‌మెంట్లతో పాటు భువనేశ్వర్‌లోనూ నివాస ఆస్తులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 1.98 కోట్లుగా ఉంది. వీటి నిర్మాణం, కొనుగోలు కోసం ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగా.. ప్రధాన్ పేరిట రూ. 31.38 లక్షలు బ్యాంకు రుణం మిగిలి ఉంది.

Advertisement

చివరగా వాహనాలు, బంగారు నగలను పరిశీలిస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ పేరిట 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య వ్యాపార అవసరాల కోసం కొన్ని వాణిజ్య వాహనాలను కలిగి ఉన్నారు. ప్రధాన్ వద్ద రూ. 13.50 లక్షలు విలువైన 200 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఉన్నాయి. ఆయన భార్య మృదుల వద్ద రూ. 35 లక్షలు విలువైన 500 గ్రాముల బంగారం, పది కిలోగ్రాముల వెండి ఉన్నట్లు అఫిడవిట్‌లో అధికారికంగా పేర్కొన్నారు.