ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త: కరోనా ఎఫెక్ట్‌తో విత్‌డ్రాకు కొత్త రూల్!
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఉద్యోగులకు వేతనాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సబ్స్క్రైబర్లకు శుభవార్త తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిందిత. దీంతో అత్యవసర ఖర్చుల కోసం ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు తమ సొమ్ములో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిచ్చింది.
లాక్డౌన్ తర్వాత సిలిండర్ బుకింగ్స్ ఎంత పెరిగాయంటే? స్టాఫ్‌కు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

అన్ని దార్లు మూసుకుపోయిన సమయంలో..
లాక్ డౌన్ నేపథ్యంలో వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీలు మూతబడ్డాయి. ప్రయివేటు రంగంలోని ఉద్యోగులకు వేతనాల్లో కోత లేదా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే ఇబ్బందులు తప్పవు. అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో ఉద్యోగికి పీఎఫ్ సొమ్ము ఊరట.

75 శాతం లేదా 3 నెలల వేతనానికి సమానం.. ఏది తక్కువైతే అధి
కరోనా కష్టాల నుండి గట్టెక్కేందుకు ఖాతాలో ఇప్పటి వరకు జమ అయిన సొమ్ములో 75 శాతాన్ని లేదా మూడు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఏది తక్కువ అయితే దానిని తీసుకోవచ్చు.

KYC సమర్పిస్తే...
KYC(నో యువర్ కస్టమర్) వివరాలు సమర్పించిన సబ్స్క్రైబర్లకి ఈ లాక్డౌన్ సమయంలో EPFO సిబ్బంది ప్రమేయం లేకుండా నగదు విత్ డ్రా చేసుకునే ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఉద్యోగ భవిష్యనిధి పథకం-1952ను సవరించేందుకు శనివారం నోటిఫికేషన్ జారీచేసినట్టు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కరోనా నేపథ్యంలో..
కరోనాపై పోరాడేందుకు లాక్డౌన్ విధించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్ ఖాతా నుంచి సబ్స్క్రైబర్లు మూడు నెలల మూలవేతనంతో పాటు కరవుభత్యాన్ని లేదా కనీస నిల్వ నుంచి 75% మొత్తం ఉపసంహరించుకోవచ్చునని, ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని చెల్లిస్తామని కార్మికశాఖ పేర్కొంది.

వీరందరికీ వర్తింపు..
దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు, సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తూ ఈపీఎఫ్ పథకం-1952లో సభ్యులుగా ఉన్న ఉద్యోగులు అందరూ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చునని తెలిపింది. ఇందుకోసం ఈపీఎఫ్ పథకం-1952లోని పేరా 68ఎల్లో సబ్ పేరా(3)ని చేర్చింది. సవరించిన ఈపీఎఫ్ పథకాన్ని మార్చి 28 నుంచే అమల్లోకి తీసుకు వచ్చింది. నగదు విత్ డ్రా కోసం సబ్స్క్రైబర్ల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించి వారికి చేయూతనివ్వాలని క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేసింది.

మిగతా వాటి కంటే తొందరగా..
ఇతర పీఎఫ్ అడ్వాన్సుల తరహా దరఖాస్తు ప్రక్రియే ఇది కూడా. ప్రత్యేక విధానమేమీ లేదు. సబ్స్క్రైబర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. కరోనా అడ్వాన్స్ క్లెయిమ్స్‌ను మిగతా వాటికంటే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ప్రాసెస్ చేస్తారు.

పీఎఫ్ ప్రభుత్వమే ఇస్తుందని
కరోనా నేపథ్యంలో 100 మంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం తీసుకుంటున్న వారు 90 శాతం మంది ఉంటే వారికి 24 శాతం పీఎఫ్ ప్రభుత్వమే ఇస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పీఎఫ్ అకౌంట్ నుండి విత్ డార్ చేసుకునే మరో వెసులుబాటు కల్పించారు. 6 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఈపీఎఫ్ కల్పించింది. ఈ మేరకు పేరా 68ఎల్లోని సబ్ పేరా 3 ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇన్నాళ్లు పెళ్లి, ఉన్నత విద్య, ఇంటి నిర్మాణం వంటి కారణాలతో పీఎఫ్ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కరోనా కారణంగా పీఎఫ్ తీసుకోవచ్చు.