EMI సరైన సమయంలో చెల్లించడం చాలా ముఖ్యం, క్రెడిట్ స్కోర్ కోసం ఇలా చేయండి
ఏదైనా హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ లేదా వెహికిల్ లోన్ వంటివి తీసుకున్నప్పుడు వారికి చెల్లించే మొత్తం మీ ఆదాయం నుండి ప్రతి నెల కొంత మొత్తం ఆయా బ్యాంకులు లేదా ఆర్థిక రంగ సంస్థలకు వెళ్తుంది. దీనిని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లేదా EMI అంటారు. డబ్బుల అత్యవసరం ఏర్పడినప్పుడు లేదా ఇల్లు వంటి పెద్ద లక్ష్యాన్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు... చేతిలో డబ్బులు లేకుంటే రుణం తీసుకోవడం తెలిసిందే. వీటిని ఈఎంఐలుగా చెల్లిస్తారు. పెద్ద మొత్తంలో కొనుగోలుకు ఈఎంఐ మంచి మార్గం.

దీర్ఘకాలం అంతేమొత్తం
రుణాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వల్పకాలిక లక్ష్యం లేదా దీర్ఘకాలిక లక్ష్యం.. ఏదైనా మనం దీనిని చెల్లించగలుగుతామా అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. మనకు ఎంత సాధ్యమైతే అంత మేరకు రుణం తీసుకోవాలి. చాలామందికి ఉండే అతిపెద్ద టార్గెట్ ఇళ్లు. బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు ఇంటి కోసం రుణాన్ని అందిస్తాయి. ఇల్లు సెక్యూర్డ్ రుణం కాబట్టి తక్కువ వడ్డీకే ఇస్తాయి. పదేళ్ల నుండి ముప్పై ఏళ్ల దీర్ఘకాల చెల్లింపు ప్రక్రియ ఇది. మీరు రుణం తీసుకున్నప్పటి నుండి దీర్ఘకాలంలో చివరికి ఆ ఇల్లు మీ సొంతమయ్యే టైమ్ ప్రేమ్లో అంతే మొత్తాన్ని మీరు చెల్లిస్తారు.

చేతిలో డబ్బుకు నాలుగైదు రెట్లు
ఇంటిని పెద్ద మొత్తంతో ఒకేసారి కొనుగోలు చేయలేని వారు ఎంతోమంది. అలాంటి వారికి హోమ్ లోన్ మంచి మార్గం. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు 70 శాతం నుండి 90 శాతం వరకు రుణం ఇస్తాయి. అంటే మీ చేతిలో ఉన్న మొత్తం కంటే నాలుగైదు రెట్లతో (రుణ సాయంతో) ఇంటిని కొనుగోలు చేయవచ్చు. ఈ మొత్తానికి గాను మీ నెల వారీ ఆదాయం నుండి ఈఎంఐ రూపంలో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కట్ చేసుకుంటాయి. ఈఎంఐలో మీ ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీరేటు ఉంటాయి.

ఇలా చేయండి
- తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తే క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. ప్రిన్సిపల్ ప్రీ-పేమెంట్ కోసం కొంత మొత్తాన్ని ఆదా చేస్తూ వెళ్లండి. మీరు ఆదా చేసిన మొత్తం, మీకు అద్దె ద్వారా వచ్చే మొత్తం, ఇతర బోనస్ లేదా ఇతర ఆదాయాలు ఎక్కువ మొత్తం అయినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీ-పేమెంట్ చేయాలి. అప్పుడు మీ ఈఎంఐ తగ్గుతుంది. అప్పుడు మీరు మీ ఈఎంఐలో తగ్గింపును లేదా కాలపరిమితిని తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం కంటే తక్కువగా ఉంది. కాబట్టి బ్యాలెన్స్ బదలీని ఎంచుకోవడానికి సరైన సమయంగా చెబుతున్నారు. హోమ్ లోన్ వడ్డీ రేటు పదేళ్ల కనిష్టానికి చేరుకుంది.