రుణాన్ని మరో బ్యాంకుకు ఎప్పుడు బదలీ చేసుకోవాలి? ఇవి తప్పనిసరి..
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో చాలామంది తీసుకునే రుణాల్లో గోల్డ్ లోన్, పర్సనల్ లోన్. చేతిలో బంగారం లేకుంటే పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇటీవల పండుగ సీజన్లో చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(NBFC)లు ప్రత్యేక ఆఫర్లతో రుణాలు అందించాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కరోనా భయాలు ఇంకా వెంటాడుతుండటంతో ఆర్థిక భారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు రుణాన్ని ఇతర బ్యాంకుకు బదలీ చేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇటీవల హోమ్ లోన్ వడ్డీ రేట్లను కూడా పలు బ్యాంకులు తగ్గించాయి. హోమ్ లోన్ ట్రాన్సుఫర్ ద్వారా కూడా రుణ భారాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అలాగే పర్సనల్ లోన్ కూడా.

రుణ బదలీతో ప్రయోజనాలు
రుణ బదలీతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. వడ్డీ రేటును తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. పలు బ్యాంకులు టాప్-అప్ లోన్లను కూడా మంజూరు చేస్తాయి. అంటే ప్రస్తుత రుణానికి అదనంగా మరికొంత మొత్తాన్ని ఇస్తాయి. మనం ఏ బ్యాంకుకు అయితే లోన్‌ను బదలీ చేస్తున్నామో వారే రుణ మొత్తాన్ని మొదటి బ్యాంకుకు చెల్లిస్తారు. టాప్-అప్ లోన్ తీసుకుంటే ఆ మొత్తాన్ని మన ఖాతాలో జమ చేస్తారు. తొలి బ్యాంకుతో పోలిస్తే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉండే అవకాశముంది. క్రెడిట్ హిస్టరీ బాగుంటే ప్రాసెసింగ్ ఫీజు రద్దు అవుతుంది. ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఎప్పుడు వెళ్లాలి..
రుణ బదలీ చేసుకోవడానికి ముందు వడ్డీ రేటులో మంచి మార్పు ఉంటేనే వెళ్లడం మంచిది. లేదంటే కొత్త బ్యాంకులో ఉండే ప్రాసెసింగ్ ఫీజు వంటి వాటిని కలుపుకుంటే ప్రయోజనం తగ్గుతుంది. కాబట్టి వడ్డీ రేటు చాలా వరకు తక్కువగా ఉండాలి. అలా అయితేనే ప్రయోజనం ఉంటుంది. వడ్డీ రేటు, కాలపరిమితి, ఈఎంఐ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చూడాలి. అన్నింటిని పరిశీలించి, మొదటి బ్యాంకు కంటే రెండో బ్యాంకులో భారం తగ్గుతుందా లేదా చూసుకొని ముందడుగు వేయాలి.

ఇది మరింత మంచి మార్గం
చాలామంది హోమ్ లోన్ తర్వాత పర్సనల్ లోన్ తీసుకుంటారు. అలా కాకుండా హోమ్ లోన్ పైనే టాప్-అప్ తీసుకోవడం మంచిది. అప్పుడు వడ్డీ రేటు తగ్గుతుంది. వ్యక్తిగత రుణాన్ని బదలీ చేసుకోవడం కంటే ఇది మరింత మంచి మార్గం.
రుణాన్ని ట్రాన్సుఫర్ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు వంటి అదనపు ఛార్జీల చెల్లింపులు ఉంటాయి. రుణ కాలపరిమితి కూడా మారే అవకాశముంది. ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి.