భారీ నష్టాల్లో మార్కెట్లు, నెలలో 9% పతనం: ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?
స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 11) భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు క్షీణించింది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో కేవలం పది మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగతా 20 నష్టపోయాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 16,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఐబీ హౌసింగ్ 21 శాతం, రుచి సోయా 10 శాతం నష్టపోయాయి. గత నాలుగు వారాల్లో రుచి సోయా షేర్లు భారీగా పడిపోయాయి. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఏ దశలోను కోలుకోలేదు.

భారీగా పతనమైన సూచీలు
సెన్సెక్స్ నేడు ఓ దశలో 600 పాయింట్లకు పైగా క్షీణించింది. అమెరికాలో ఏప్రిల్ నెలకు సంబంధించి ద్రవ్యోల్భణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఇన్వెస్టర్లు ఈ దిశగా దృష్టి సారించారు. మరోవైపు ద్రవ్యోల్భణం, మందగమన సూచనల మూలంగా గత కొన్ని రోజులుగా ప్రపంచ మార్కెట్లలో వీస్తున్న ప్రతికూల పవనాలు కొనసాగుతున్నాయి. దీంతో సూచీలు నేడు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోయి 54,088 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి 16,167 పాయింట్ల వద్ద ముగిసింది.
రంగాల విషయానికి వస్తే బ్యాంకింగ్, రియాల్టీ సూచీలు మాత్రమే 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పవర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ 0.5 శాతం నుండి 1 శాతం క్షీణించాయి.
నేడు వీనస్ పైప్స్ ఐపీవోకు మంచి స్పందన లభించింది. డెలివరీ ఐపీవో కూడా ఈ రోజే ప్రారంభమైంది.

9 శాతం కరెక్షన్
స్టాక్ మార్కెట్లు గత నెల రోజుల్లో దాదాపు 9 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 9 శాతం చొప్పున క్షీణించాయి. వరుసగా నాలుగు సెషన్లు సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ నెలలో మే 11వ తేదీ వరకు ఏడు సెషన్లు ఉండగా, కేవలం ఒక సెషన్ మాత్రమే లాభపడింది. మొత్తానికి నెల రోజుల్లో సూచీలు దాదాపు డబుల్ డిజిట్ స్థాయిలో కరెక్షన్ అయ్యాయి.

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?
గత కొద్ది రోజులుగా భారత మార్కెట్ నుండి FIIలు తరలి పోతున్నాయి. అయితే డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల నిరంతర కొనుగోలు మార్కెట్‌కు కొంత స్థిరత్వాన్ని ఇస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో తక్కువ గ్రేడ్ స్టాక్స్ వైపు రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పరుగెడుతున్నారని, మరోవైపు ఎఫ్ఐఐలు తరలి వెళ్తున్నాయని, ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో దీర్ఘకాలానికి గాను తక్కువ పరిమాణంలో అధిక నాణ్యత కలిగిన స్టాక్స్‌ను కొనుగోలు చేయడం సరైన వ్యూహమని చెబుతున్నారు. మార్కెట్ పతనం, అనిశ్చితి కాలంలో దీర్ఘకాలానికి, మంచి స్టాక్స్ ఎంచుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది అని సూచిస్తున్నారు.