10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (జనవరి 21) సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ ఏకంగా 50,000 పాయింట్లు క్రాస్ చేసింది. నిఫ్టీ కూడా 14,750 దిశగా దూసుకెళ్తోంది. నవంబర్ నుండి ఈ రెండున్నర నెలల కాలంలో సెన్సెక్స్ 8000 పాయింట్లు లాభపడింది. గత ఏడాది మార్చి 23న 26వేల దిగువకు పతనమైన సెన్సెక్స్ లాక్ డౌన్ కాలంలో మందకోడిగా కదిలింది. అన్-లాక్ అనంతరం, అలాగే ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమైనట్లుగా సంకేతాలు రావడంతో 2020-21 రెండో అర్ధసంవత్సరంలో మార్కెట్ దూకుడు పెరిగింది. ఆగస్ట్ నుండి సెన్సెక్స్ 13వేల పాయింట్లు, నవంబర్ రెండో వారం నుండి 8వేల పాయింట్లు లాభపడింది.

10 నెలల్లో రెండింతలు
2020 మార్చి నెలలో 25,639 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత నుండి అంతకంతకూ పెరిగి, ఈ 10 నెలల కాలంలో దాదాపు రెండింతలైంది. 50వేల మార్కు దాటింది. నిఫ్టీ కూడా సరికొత్త శిఖరాలను 14,700 దాటింది. జోబిడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అమెరికా పుంజుకున్నాయి.
ఆసియా మార్కెట్లు నేడు సరికొత్త రికార్డును తాకాయి. జోబిడెన్ మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తారనే అంచనాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్ లాభపడింది. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్ల పైన పడింది. అమెరికాలో అధికార మార్పిడి అంత ఈజీగా జరగదని భావించినప్పటికీ, చాలా సులభంగా జరిగిందని, ఇది కూడా మార్కెట్ జోష్‌కు కలిసి వచ్చిందని చెబుతున్నారు.

100 శాతం రిటర్న్స్
గత కొద్ది రోజులుగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్లోకి FIIలు తగ్గాయి. అయితే బుధవారం కాస్త సానుకూలంగా మారి రూ.2200 కోట్లుగా నమోదయ్యాయి. కార్పోరేట్ ఫలితాలు కూడా మార్కెట్ జోష్‌కు కారణమేని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్, అమెరికాలో అధికార మార్పిడీ ఈజీగా ఉండటం, భారీ ఆర్థిక ప్యాకేజీ, రానున్న బడ్జెట్ వంటి వివిధ కారణాలతో మార్కెట్ జంప్ చేసి, ఈ 10 నెలల కాలంలో 100 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

సెన్సెక్స్ 54000 మార్కుకు!
ఇదే ఒరవడి కొనసాగితే వచ్చే ఆరు నెలల కాలంలో సెన్సెక్స్ 54000 మార్కును చేరుకుంటుందని అంటున్నారు. మార్చి కనిష్టం (25,639) నిన్నటి వరకు సెన్సెక్స్ నిన్నటి వరకు 95 శాతం లాభపడగా, నేడు 50వేలు దాటిన తర్వాత 100 శాతం దరిదాపుల్లోకి వచ్చింది.