20కి పైగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎంతంటే? 8.9% నుండి స్టార్ట్
ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ గుర్తుకు వస్తుంది. ఇది వరకు పర్సనల్ లోన్ తీసుకుంటే రుణం రావడానికి కొద్దిరోజుల సమయం తీసుకునేది. ఇప్పుడు నిమిషాల్లోనే ఈ రుణం వస్తుంది. గోల్డ్ లోన్ అయితే బంగారంపై ఇస్తారు. కానీ పర్సనల్ లోన్ మాత్రం ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇస్తారు. ఇది అసురక్షిత రుణం. కాబట్టి వడ్డీ రేటు హోమ్ లోన్, గోల్డ్ లోన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అసురక్షిత రుణం కాబట్టి మీ ఆదాయాన్ని, క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి బ్యాంకులు. పెళ్లి, ఇంటి పునర్నిర్మాణం, వైద్య అత్యవసరం, విద్య మొదలైన వాటి కోసం తక్షణ అవసరమైతే రుణం పొందవచ్చు.

ఇబ్బంది లేకుండా రుణం
అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో పర్సనల్ లోన్ ఒకటి. మీ ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్ మొత్తం, వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రీ-అప్రూవ్డ్ లోన్ అయితే గంటలు, నిమిషాల్లో వచ్చేస్తుంది. చాలా బ్యాంకులు వారం రోజుల లోపు ఇతర రుణాలను అందిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, అర్హత ప్రమాణాలకు తగినట్లుగా ఉంటే, ఇబ్బంది లేకుండా రుణం వస్తుంది.

వడ్డీ రేటులో తేడా
రుణదాత నుండి రుణదాతకు వడ్డీ రేటులో తేడా ఉంటుంది. అంటే ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. హోమ్ లోన్ కంటే, గోల్డ్ లోన్ కంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులో వడ్డీ రేటు, ఆయా బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పర్సనల్ లోన్ మంజూరు చేయడానికి ప్రధానంగా శాలరైడ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. అయితే క్లీన్ క్రెడిట్ చరిత్ర కలిగి ఉండాలి. లోన్ దరఖాస్తు చేసినప్పుడు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఆదాయ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను సమర్పించాలి.
వేతనం పొందేవారు మూడు నెలల పే స్లిప్స్‌ను సమర్పించాలి. ఫామ్ 16ని సమర్పించాలి. గత ఏడాది ఐటి రిటర్న్స్‌ను కూడా సమర్పించవలసి ఉంటుంది.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 8.90 శాతం, ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 9.05 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9.45 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు 9.50 శాతం, ఎస్బీఐ 9.60 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10 శాతం, యూకో బ్యాంకు 10.05 శాతం, కొటక్ బ్యాంకు 10.25 శాతం, ఫెడ్ బ్యాంకు, ఐడీఎఫ్సీబ్యాంకు 10.49 శాతం, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు 10.50 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంకు 10.55 శాతం, ఐవోబీ 10.80 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 11 శాతం, కెనరా బ్యాంకు 11.25 శాతం, ధనలక్ష్మి బ్యాంకు 11.90 శాతం, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు 12 శాతం, కర్నాటక బ్యాంకు 12.45 శాతంగా ఉంది.