క్రెడిట్ స్కోర్, బీమా, ఎమర్జెన్సీ ఫండ్: ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు
పెట్టుబడులు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత వేగంగా షార్ట్ టర్మ్ లేదా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తికి 25 ఏళ్ళ వయస్సులో ఉద్యోగం వస్తే అప్పటి నుండి పెట్టుబడులను ప్రారంభించాలి. పునాది బలంగా ఉంటే మున్ముందు ఆర్థిక సంక్షోభం తలెత్తినా కోలుకునే పరిస్థితి ఉంటుంది. సంపాదన, ఖర్చులు, పెట్టుబడులు అన్నింటి పైన అవగాహన కలిగి ఉండాలి.
ఒకవిధంగా చెప్పాలంటే తక్కువ వయస్సులోనే ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు బలమైన పునాదిని నిర్మించుకోవాలి. నైపుణ్యాలు పెంచుకునేందుకు కొత్త కోర్సులు నేర్చుకోవాలి, అనుభవజ్ఞుల ద్వారా మెలకువలు నేర్చుకోవాలి.

ఎమర్జెన్సీ ఫండ్
ప్రతి వ్యక్తి కూడా ఆర్థిక సంక్షోభంలో త్వరగా కోలుకునేందుకు ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ సంపాదనలో మీ నెలవారీ ఖర్చు, పెట్టుబడితో పాటు ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా కొంత కేటాయించాలి. కోరనా మహమ్మారి ఎమర్జెన్సీ ఫండ్ అవసరాన్ని నొక్కి చెప్పింది. కరోనానే కాదు, అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఎంతో ప్రయోజనకరం. కాబట్టి ఇలాంటి వాటికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

రుణాలు తీర్చేయాలి
చదువుకునే సమయంలో చేసిన చిన్నచిన్న రుణాలను త్వరగా ముగించుకోవాలి. ఉదాహరణకు స్టడీ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిని సాధ్యమైనంత త్వరగా తీర్చేయాలి. ఎందుకంటే వాటిని తీర్చకుంటే వడ్డీ పెరిగి భారంగా మారుతుంది. అప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. హోమ్ లోన్ వంటివి కూడా ప్రారంభంలోనే చేతిలో డబ్బులు ఉన్నప్పుడు తీర్చడానికి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే హోమ్ లోన్ పైన ప్రారంభంలో కట్టే ఈఎంఐలో సగానికి పైగా వడ్డీయే ఉంటుంది.

ఆర్థిక సంక్షోభం తలెత్తితే...
ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ కొన్ని సమయాల్లో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయి. వాటిని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఎమర్జెన్సీగా వచ్చే కొన్ని అవసరాలకు డబ్బు అందకపోవచ్చు. అలాంటి సమయంలో మనకు ప్రత్యామ్నాయం రుణం. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మంజూరుకు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, వడ్డీ రేటు పైన కూడా ప్రభావం ఉంటుంది.

బీమా తప్పనిసరి
మీపై ఆధారపడే వారు ఉంటారు. కాబట్టి ఆరోగ్య, జీవిత బీమా తప్పనిసరి. మీతోపాటు ఇంట్లోవాళ్లకు కూడా పాలసీలు చేయించడం మంచిది. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది ఓ రకంగా ఇది పొదుపు చేయడం కిందకు వస్తుంది. అలాగే, ఇంటి నిర్మాణం వంటి పెద్ద అడుగు వేసే సమయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.