భారీ నష్టం, ఇప్పటికీ 50% నష్టపోయిన పేటీఎం ఇన్వెస్టర్లు
ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నవంబర్ 18, 2021లో లిస్ట్ అయింది. పేటీఎం ఇష్యూ ధర రూ.2150 కాగా, ప్రస్తుతం రూ.1116కు పడిపోయింది. ఈ స్టాక్ ప్రారంభం రోజునే భారీగా నష్టపోయింది. నవంబర్ 18న లిస్ట్ అయిన ఈ స్టాక్ అదే రోజు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 9 శాతానికి పైగా క్షీణించి రూ.1950 వద్ద లిస్ట్ అయింది. బీఎస్ఈలో కూడా తొమ్మిది శాతం మేర క్షీణించి రూ.1955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంటే లిస్టింగ్ కూడా ఇష్యూ ధర కంటే నష్టాలతోనే ప్రారంభమైంది.

భారీ నిధుల సమీకరణ లక్ష్యంతో..
రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకు సబ్స్క్రిప్షన్ స్పందన అంతంతే. భారత్‌లోనే కాదు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అతిపెద్ద ఐపీఓ కానీ, ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్స్ వచ్చాయి. పేటీఎం కంటే ముందు 2010లో కోల్ ఇండియా రూ.15,200 కోట్ల అతిపెద్ద ఐపీవోతో వచ్చింది. వన్97 కమ్యూనికేషన్ 2000లో ప్రారంభమైంది. మొదట మొబైల్ టాప్-అప్స్, బిల్లు చెల్లింపులు సేవలను అందించింది. 2009లో డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విజయ్ శేఖర్ శర్మ పేటీఎంను 2010లో మొబైల్ రీచార్జ్ కోసం ఈ ప్లాట్‌ఫాంను తీసుకు వచ్చారు. అప్పటి నుండి విశేష ఆదరణ లభించింది.

ఇప్పటి వరకు వారికి ప్రాఫిట్ లేదు
పేటీఎం గత 9 సెషన్లలోనే 21 శాతం క్షీణించింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు సగం పడిపోయింది. అయితే లిస్టింగ్‌తో పోలిస్తే నేటి వరకు దాదాపు 30 శాతం క్షీణించింది. ఓ సమయంలో రూ.1 లక్ష కోట్లు దాటిన ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు రూ.72 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.1955, 52 వారాల కనిష్టం రూ.1000. అంటే ఐపీవో వ్యాల్యూతో పోలిస్తే సగం కంటే ఎక్కువగా పతనమైంది. ఈ కంపెనీ లిస్ట్ అయి దాదాపు రెండు నెలలు అవుతోంది. కానీ ఐపీవోలు పాల్గొన్నారు ఇప్పటి వరకు ప్రాఫిట్ పొందనట్లుగానే భావించవచ్చు.

మరింత క్షీణిస్తుందా?
పేటీఎం స్టాక్ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. పేటీఎం ఐపీవో ఓవర్ వ్యాల్యూ అయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఐపీవోలో పాల్గొని ఈ స్టాక్‌ను అట్టిపెట్టుకున్న వారు దాదాపు సగం నష్టపోయినట్లే. అయితే శుక్రవారం మాత్రం ఈ స్టాక్ కాస్త పుంజుకుంది. 8 శాతం లాభపడింది. రూ.1116 వద్ద ముగిసింది.