LTC cash voucher scheme: కేంద్రం మరో గుడ్‌న్యూస్, కుటుంబ సభ్యులు కూడా...
ఢిల్లీ: లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) వోచర్ స్కీంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. పండుగ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బొనాంజా కింద ఎల్టీసీ నగదు వోచర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. కరోనా కారణంగా మందగించిన డిమాండ్ పుంజుకోవడానికి కూడా ఈ పథకం ఉపయోగపడుతుందని ఆర్థికవేత్తలు, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఎల్టీసీ స్కీంకు సంబంధించి అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ వస్తోంది. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ తర్వాత దీనిని ఉద్యోగులందరికీ వర్తింప చేసింది. తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది.
LTC క్యాష్ వోచర్ స్కీం: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్

కుటుంబ సభ్యులు కూడా కొనుగోళ్లు జరపవచ్చు
ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీం కింద ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా కొనుగోళ్లు జరుపుకోవచ్చునని కేంద్రం తెలిపింది. ఈ మేరకు డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ FAQలో పేర్కొంది. ఎల్టీసీ పథకం వినియోగించకుండా అక్టోబర్ 12వ తేదీ తర్వాత కొనుగోలు చేసిన వస్తువులకు కూడా రీయింబర్సుమెంట్స్ పొందవచ్చునని తెలిపింది. అయితే జీఎస్టీ 12 శాతానికి పైగా ఉండాలని తెలిపింది.

రికార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 12వ తేదీన ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద కొనుగోలు చేసే వస్తువుల బిల్లులపై ఉద్యోగుల పేరు ఉండాలా లేదా కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చునా అనే ప్రశ్న రాగా, సంబంధిత మంత్రిత్వ శాఖ నుండి సానుకూల సమాధానం వచ్చింది. ఉద్యోగి కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీద అయినా కొనుగోళ్లు చేయవచ్చునని తెలిపింది. అయితే ఆ కుటుంబ సభ్యుల పేర్లు తప్పకుండా ఉద్యోగి సర్వీస్ రికార్డుల్లో ఉండాలని పేర్కొంది. ఈఎంఐ రూపంలో కొనుగోలు చేసే వాటికి కూడా ఈ స్కీం వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు ఎల్టీసీని ఉపయోగించకుండా వస్తువులు కొనుగోలు చేసినా వాటిపై రీయింబర్సుమెంట్స్ పొందవచ్చు.

ఎల్టీసీ వోచర్ స్కీం
ఎల్టీసీ వోచర్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. 12 శాతం లేదా ఆ పైన జీఎస్టీ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అది కూడా డిజిటల్ రూపంలో ఉండాలి. అక్టోబర్ 12, 2020 నుండి మార్చి 31, 2021 లోపు ఎల్టీసీ క్యాష్ వోచర్‌ను వినియోగించాలి. అయితే ఎల్టీసీ వోచర్‌కు మూడు రెట్ల ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ.50వేల వోచర్‌కు అర్హులు అనుకుంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాలి. జీఎస్టీ నెంబర్, జీఎస్టీ వివరాలు తెలియజేయాలి.