IT రిటర్న్స్ ఫైల్ చేశారా, మరికొద్ది రోజులే ఉంది: ఇవి దృష్టిలో పెట్టుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి మరో పక్షం రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2021-22 అసెస్మెంట్ ఇయర్ (AY) ఐటీ రిటర్న్స్ కోసం చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ముందు ట్యాక్స్ పేయర్స్ పలు అంశాలను తెలుసుకోవాలి. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా వేసిన ప్రభుత్వం చివరిసారి డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో వచ్చిన పలు మార్పులను, మరిన్ని విషయాలను తెలుసుకోవాలి.

వారికి ఐటీ రిటర్న్స్ అవసరంలేదు
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఏప్రిల్ 1, 2021 నుండి డిసెంబర్ 13, 2021 వరకు రూ.1,36,779 కోట్లను రీఫండ్ చేసింది. కార్పోరేట్ ట్యాక్స్ రీఫండ్ కింద 2,02,705 కేసులకు రూ.90,340 రీఫండ్ చేసింది. 1,25,34,644 కేసులకు రూ.46,438 కోట్లు రీఫండ్ చేసింది. AY 2021-22కు సంబంధించి రూ.18,848.60 కోట్ల 90.95 లక్షల రీఫండ్ కేసులు ఉన్నాయి.
- ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫాం 26ASను, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS)ను చూసుకోవచ్చు. టీడీఎస్, ట్యాక్స్ పేమెంట్, ఐటీఆర్స్ ప్రీ-ఫైలింగ్ అక్యూరసీని చూడాలి.
- ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు, విక్రయాల నేపథ్యంలో AIS స్టేట్మెంట్ డేటాను తమ బ్యాంకు పాస్‌బుక్, ఇంటరెస్ట్ సర్టిఫికెట్, ఫామ్ 16, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్తో కలిసి క్రాస్ చెక్ చేసుకోవాలి.
- స్పెషలైజ్డ్ సీనియర్ సిటిజన్లకు ఐటీ రిటర్న్స్ ఫైల్ నుండి మినహాయింపు ఉంది. 75 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఆదాయం, అకౌంట్ నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని మాత్రమే ఎక్కువగా కలిగి ఉంటారు. అలాంటి వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు.
- కోవిడ్ 19 వైద్య చికిత్స మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించారు.
- మీరు ఐటీఆర్‌ను ఎంత త్వరగా ఫైల్ చేస్తే అంత మంచిది. AY 2021-22కు గాను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాక, ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక, రిటర్న్స్ ప్రాసెస్ చేసి, బ్యాంకులో రీఫండ్ చేస్తుంది.

ఐటీఆర్ 1, ఐటీఆర్ 2
- వేతన ఆదాయం, ఆదాయంపై వడ్డీ రేటు, 1 హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్1 ఫైల్ చేయాలి.
- ఒకటి కంటే ఎక్కువ హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ కలిగిన వారు ఐటీఆర్2 ఫైల్ చేయాలి.
- ప్రీ-ఫిల్డ్ ఐటీ రిటర్న్స్ కాబట్టి ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మరింత ఈజీ.
- ఫాం 16, బ్యాంకు స్టేట్మెంట్, బ్యాంకు వడ్డీ రేటు సర్టిఫికెట్, హౌసింగ్ లోన్ వడ్డీ రేటు, రెంటల్ రిసిప్ట్స్, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్ వంటివి ఉంటాయి.

పాత లేదా కొత్త స్లాబ్
ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులకు రెండు ఐచ్చికాలు ఉన్నాయి. పాత పన్ను స్లాబ్ లేదా కొత్త స్లాబ్ కింద ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. పాత స్లాబ్ అయితే రాయితీలు, మినహాయింపులు ఉంటాయి. కొత్త స్లాబ్ అయితే పన్నురేటు తక్కువగా ఉంటుంది. కానీ, ఎలాంటి మినహాయింపులు ఉండవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, 80సీ, 80సీసీడీ, 80డీ, 80జీ.. వంటి వాటి కింద మినహాయింపులు పొందాలనుకునేవారు పాత పద్ధతిని ఎంచుకుంటే ఉత్తమమని ఆర్థిక నిపుణుల సూచన. అయితే, కొత్త పద్ధతికి వెళ్లేవారు ముందే ఫాం 10-ఐఈని సమర్పించాలి. దాని అక్నాలెడ్జ్మెంట్ సంఖ్యను ఐటీఆర్‌లో పొందుపరచాలి.

డివిడెండ్.. పన్ను
గతంలో కంపెనీలు తాము ఇచ్చే డివిడెండ్స్ పైన 15 శాతం పన్ను చెల్లించేవి. దీనికి సర్‌ఛార్జీ, సెస్ అదనం. అలా చూస్తే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) దాదాపు 20.56 శాతంగా ఉండేది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 115 బీబీడీఏ ప్రకారం వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల చేతికి వచ్చే డివిడెండ్ మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు.
దీనికి మించి డివిడెండ్‌ను పొందినప్పుడు ఆ అధిక మొత్తంపై 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ అందించే డివిడెండ్ మొత్తంపై ఎలాంటి పన్నులేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(35) ప్రకారం దీనికి పూర్తిగా మినహాయింపు వర్తిస్తుంది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం చూస్తే ఇన్వెస్టర్లకు వచ్చిన డివిడెండ్ ప్రతి రూపాయి వారి ఆదాయంలో కలిపి చూపించాలి. ఈ ప్రకారం ఆదాయాన్ని గణించి, వర్తించే స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఇదే కాకుండా కంపెనీలు చెల్లించే డివిడెండ్ మొత్తం రూ.5,000 దాటితే 10 శాతం టీడీఎస్ విధిస్తారు.

ఇది గుర్తుంచుకోండి
పన్నులు చెల్లించడంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రతి ఏడాది కొత్త ఐటీ ఫామ్స్‌ను రూపొందిస్తుంది ఐటీ శాఖ. సరైన ఫాంను ఎంచుకునేందుకు ఈ మార్పులను తెలుసుకోవడం అవసరం. ఈ ఏడాది కూడా ఐటీఆర్-1 అర్హత ప్రమాణాలలో కొన్ని మార్పులు చేశారు. దీనిని సాధారణంగా వేతన ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులు ఉపయోగిస్తారు.
సెక్షన్ 194ఎన్ కింద నగదు ఉపసంహరణ కోసం టీడీఎస్ డిడక్ట్ చేసిన వ్యక్తులు లేదా యజమాని నుండి ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్‌పై డిఫర్డ్ ట్యాక్స్ పొందినవారు ఇకపై ఐటీఆర్ 1 ను దాఖలు చేయవద్దు. అలాగే డిడక్ట్ అయిన ఏడాదిలో మాత్రమే టీడీఎస్‌ను క్లెయిమ్ చేసుకోవాలి. దీనిని తర్వాత ఏడాదికి క్యారీఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోవాలి.