సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23న సెన్సెక్స్ 26వేల దిగువకు పడిపోయింది. లాక్ డౌన్ సమయంలో మార్కెట్లు నిరాశ పరిచాయి. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో మార్కెట్లు క్రమంగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. నవంబర్ రెండో వారంలో42,000గా ఉన్న సెన్సెక్స్ కేవలం రెండున్నర నెలల కాలంలోనే ఏకంగా 50,000 మార్కును క్రాస్ చేసింది. అయితే మార్కెట్ ఎప్పటికైనా కరెక్షన్కు గురి కావొచ్చునని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు

అందుకే పైపైకి.. కరెక్షన్
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, దేశీయ మార్కెట్లోకి FPIల ఫ్లో, కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వంటి వివిధ కారణాల చేత సెన్సెక్స్ రెండున్నర నెలలుగా దాదాపు 8వేల పాయింట్లు ఎగిసింది. అయితే సెన్సెక్స్ గత గురువారం 50వేల పాయింట్లు తాకి చరిత్రను సృష్టించినప్పటికీ, ఆ మార్కును నిలుపుకోలేకపోయింది. ఇప్పటికీ సెన్సెక్స్ 49,000 పాయింట్ల దిగువనే ఉంది. అదుపు లేకుండా ఎగిసిపడుతున్న మార్కెట్ ఎప్పటికైనా భారీ కరెక్షన్కు గురి కావొచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుమూడుసార్లు మార్కెట్ కరెక్షన్కు గురయింది. అయితే అదే స్థాయిలో పెరిగింది. కానీ అసలు కరెక్షన్ ముందుంది అని అంటున్నారు.

మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. 2019లో ఆర్థిక మందగమనం మరిచిపోకముందే 2020లో కరోనా భారీగా దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో అన్ని రంగాలు, అన్ని వర్గాలు బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దెబ్బతిన్న రియాల్టీ, ఆటో, విమానయానం, హాస్పిటాలిటీ సహా వివిధ రంగాలకు ఊరట కల్పించే ప్రకటనలు వెలువడవచ్చునని భావిస్తున్నారు. మార్కెట్లు కూడా బడ్జెట్ దిశగా చూస్తున్నాయి. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు మార్కెట్ పైకీ కిందకు కదలడం సహజం. అంచనాలు, వెలువడే వార్తలకు అనుగుణంగా కదులుతుంటుంది.

అంచనాలకు అనుగుణంగా లేకుంటే..
నిర్మలమ్మ ప్రవేశ పెట్టే బడ్జెట్ అన్ని రంగాలు, వర్గాల అంచనాలకు అనుగుణంగా లేకుంటే మార్కెట్ కుప్పకూలే అవకాశముందని, ఇదే షార్ట్ టర్మ్ కరెక్షన్గా ఉండవచ్చునని భావిస్తున్నారు. హెల్త్ రంగం నుండి అన్నీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. బడ్జెట్ పైన భారీ ఆశలు ఉన్నందున, ఇప్పటికే ఆదాయం లేక తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నకేంద్రం హెల్త్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అంచనాలను అందుకోలేకపోవచ్చునని, కాబట్టి బడ్జెట్ రోజు, ఆ తర్వాత మార్కెట్ పతనం అయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.