శుభవార్త.. జనవరి నుంచి ఆన్లైన్ నెఫ్ట్ చార్జీలు ఉండవు!
సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరో శుభవార్త చెప్పింది. అదేమిటంటే.. వచ్చే జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు 'నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్' (నెఫ్ట్) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పెద్ద నోట్లు రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
బ్యాంకుల మధ్య ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి 'నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్' (నెఫ్ట్), రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్) అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంటుంది. ఆర్టీజీఎస్ అయితే ప్రతీ లావాదేవీ అప్పటికప్పుడే, విడిగా పూర్తి అవుతుంది. నెఫ్ట్ లావాదేవీలను మాత్రం బ్యాచ్‌ల వారీగా అరగంటకు ఒకసారి పూర్తి చేస్తుంటారు.

ఏమిటీ ‘నెఫ్ట్’ విధానం?
ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక ఖాతాకు నిధులు బదిలీ చేసేందుకు ఏర్పాటు చేసిన చెల్లింపుల వ్యవస్థే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్). ఈ పద్ధతిలో రూ.2 లక్షల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు. అంతకుమించితే మాత్రం ఆర్టీజీఎస్ పద్ధతిలో నగదు చెల్లింపు జరపాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారాగాని, మొబైల్ బ్యాంకింగ్ ద్వారాగాని, లేదంటే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ కెళ్లి కూడా ఈ నెఫ్ట్ సేవలను పొందవచ్చు.

గంటల్లోనే నిధుల బదిలీ...
ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని గంటల్లో దేశంలోని ఏదైనా బ్యాంక్ ఖాతాకు నిధులు బదిలీ చేయవచ్చు. నిధుల బదిలీకి కనీస లేదా గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుతం కేవలం పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నెఫ్ట్ సేవలు బ్యాంకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ డిసెంబరు నుంచి ఈ సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి.

ఛార్జీలు ఇలా...
ప్రస్తుతానికి రూ.10 వేల వరకు నెఫ్ట్ లావాదేవీలపై రూ.2 చార్జీని, దీనికి అదనంగా జీఎస్టీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అదే రూ. 2 లక్షల పైన ఉన్న లావాదేవీలకు రూ.20 చార్జీని, దీనిపై జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అయితే దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన ఎస్బీఐ మాత్రం తన ఖాతాదారులకు జూలైలోనే ఊరట కల్పించింది. ఆన్లైన్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్) నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ (తక్షణ చెల్లింపు సేవ) చార్జీలను ఎస్బీఐ రద్దు చేసేసింది.

జులైలో చెప్పింది.. ఇప్పుడు అమలైంది...
నిజానికి నెఫ్ట్తోపాటు ఆర్టీజీఎస్ లావాదేవీలపై చార్జీలు ఎత్తివేయాలంటూ ఆర్బీఐ జూలైలో పరపతి సమీక్ష సందర్భంగానే బ్యాంకులకు సూచించింది. అయితే ఎప్పట్నించి దీనిని అమలు చేయాలన్న విషయం అప్పట్లో ప్రకటించలేదు. తాజాగా శుక్రవారం దీనిపై బ్యాంకులకు ఆదేశాలు పంపుతూ.. వచ్చే జనవరి నుంచి నెఫ్ట్ లావాదేవీలు ఉచితంగా నిర్వహించాలని ప్రకటించింది.

నగదు బదిలీ వ్యయాలను తగ్గించేందుకే...
నగదు బదిలీ వ్యయాలను తగ్గించేందుకే కొత్త విధానాలను అమలులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ.. దేశంలోకి నగదు ఎక్కువగా బదిలీ అయ్యే దేశాలతోనూ ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. భూటన్లోనూ ‘రూపే' కార్డులను అనుమతిస్తున్నారని తెలిపింది. అలాగే త్వరలో ‘క్యూఆర్ కోడ్స్' వ్యవస్థపైనా ఒక కమిటీని నియమించనున్నట్లు పేర్కొంది. 2020 జనవరి 1 నుంచి డిజిటల్ మరియు కార్డు చెల్లింపులకు అవసరమైన మౌలిక వసతుల కోసం ‘యాక్సెప్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్'ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.

కొత్తగా ‘ఫాస్టాగ్స్’ ప్రతిపాదన...
పార్కింగ్, టోల్ రుసుము, పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ‘ఫాస్టాగ్స్' విధానాన్ని అమలు చేయాలని కూడా ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించింది. చెల్లింపులు జరిపే అవకాశం కల్పించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. దీనికోసం చెల్లింపుల వ్యవస్థలన్నింటినీ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) ఫాస్టాగ్స్తో అనుసంధానించాలని పేర్కొంది. తరచూ జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే వారి సౌలభ్యం కోసం ఈ ‘ఫాస్టాగ్స్' విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలుత టోల్గేట్ చెల్లింపుల్లో ఈ విధానాన్ని అమలు చేసినా.. క్రమంగా పార్కింగ్, పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకూ ఈ విధానం అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.