హోమ్ లోన్ తీసుకుంటున్నారా, ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత నెలలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. దాదాపు రెండేళ్లుగా వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. రెపో రేటు దశాబ్దం కనిష్టం వద్ద ఉంది. రెపో రేటు తగ్గిన నేపథ్యంలో వివిధ బ్యాంకులు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్ వడ్డీ రేట్లను కూడా భారీగానే తగ్గించాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ లేదా HDFC కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గించింది. కొత్త దరఖాస్తుదారులకు రుణ మొత్తం లేదా ఉద్యోగ వర్గంతో సంబంధం లేకుండా 6.7 శాతం హోమ్ లోన్ వడ్డీ రేటును అందిస్తోంది. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకులు కూడా ఇదే వడ్డీని ఇస్తున్నాయి.

7 శాతం దిగువకు పడిపోయిన వడ్డీ రేటు
కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.55 శాతంతో అందిస్తోంది. ఎస్బీఐ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. కరోనా అనంతరం వడ్డీ రేట్లు తగ్గాయి. ఏడాది నుండి వివిధ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం కంటే దిగువకు పడిపోయాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటే హోమ్ లోన్ వడ్డీ రేటు తగ్గుతుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే దానిని గుడ్‌గా పరిగణిస్తారు. కాబట్టి క్రెడిట్ స్కోర్ బాగుండేలా చూసుకోవాలి.

చాలా తక్కువ స్థాయిలో హోమ్ లోన్ వడ్డీ రేటు
HDFC మేనేజింగ్ డైరెక్టర్ రేణుసూద్ కర్నాటడ్ మాట్లాడుతూ... దశాబ్దాల గరిష్టం వద్ద వడ్డీ రేట్లు ఉన్నాయని, దీనికి తోడు ప్రభుత్వ సబ్సిడరీలు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనకరమని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ మెజర్స్ నేపథ్యంలో వడ్డీ రేట్లు క్షీణించాయని, ఆర్థిక రికవరీకి అండగా ఉండేందుకు ఆర్బీఐ, కేంద్రం చర్యలు తోడ్పడుతున్నాయన్నారు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు ప్రస్తుతం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపారు.

వీటిని పరిగణలోకి తీసుకోవాలి
అయితే కస్టమర్లు ఇంటిని కొనుగోలు చేయడానికి ముందు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు కనిష్టస్థాయిలో ఉన్నాయి. అయితే ఎప్పటికీ ఈ స్థాయిలోనే ఉండదు. మున్ముందు వడ్డీ రేట్లు పెరిగితే అప్పుడు కొనుగోలు చేస్తే మీ ఈఎంఐ పెరుగుతుంది. రెపో రేటు ప్రస్తుతం 4 శాతం వద్ద కనిష్టస్థాయిలో ఉంది.
2022 మొదటి అర్ధ సంవత్సరం చివరలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు డౌన్ పేమెంట్ విషయంలోను ప్రణాళికతో ఉండాలి. ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ ఉంటే అంత తక్కువ భారం ఈఎంఐగా వస్తుంది. వీటితో పాటు ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాపర్టీ ట్యాక్స్ వంటివి ఉంటాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.