SBI customer alert: ఈ ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త!
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఓ అలర్ట్ సందేశాన్ని పంపించింది. కొన్ని పిషింగ్ స్కామ్ కాల్స్‌కు బుక్ కావొద్దని హెచ్చరించింది. అంతేకాదు, కేవైసీ అప్ డేట్ కోసం అంటూ వచ్చే పిషింగ్ లింక్స్ పైన క్లిక్ చేసి, ఇబ్బందుల్లో పడవద్దని సూచించింది. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తమ కస్టమర్లు చీటర్స్ చేతిలో బుక్ కాకుండా ఉండేందుకు ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఇందులో భాగంగా తాజాగా ఎస్బీఐ తమ కస్టమర్లను ఫేక్ ఫోన్ నెంబర్లు, ఫేక్ లింక్స్ నుండి అప్రమత్తం చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. మెసేజింగ్, ఈమెయిల్, ఫిషింగ్ వంటి వివిధ కమ్యూనికేషన్స్ మార్గాల ద్వారా మోసాలు జరుగుతున్నట్లు తమ కస్టమర్లకు తెలిపింది. బ్యాంకింగ్ మోసాలను ఎలా నివారించాలో కూడా సూచించింది. సైబర్ నేరాల గురించి వెల్లడించేందుకు 1930 హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించాలని తెలిపింది.

+91-8294710946, +91-7362951973 నెంబర్ల నుండి కేవైసీ అప్ డేట్ కోసం ఎస్బీఐ కస్టమర్లకు ఫిషింగ్ లింక్ పైన క్లిక్ చేయమని కోరుతున్నట్లు ట్వీట్ చేసింది. ఇలాంటి అనుమానాస్పద లేదా ఫిషింగ్ లింక్స్ పైన క్లిక్ చేయవద్దని సూచించింది. టెలికాలర్, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా అందుకున్న కేవైసీ అప్ డేట్స్ సహా సందేహాస్పద ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాస్వర్డును రహస్యంగా అట్టిపెట్టుకోవాలని తెలిపింది. వ్యక్తిగత లేదా ఖాతా సంబంధ వివరాలను ఎవరితోను పంచుకోవద్దని తెలిపింది.