బిట్ కాయిన్ సహా క్రిప్టో మహా పతనం, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?
క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పతనమైంది. ముఖ్యంగా చివరి సెషన్లో భారీగా పడిపోయింది. ఆర్థిక ప్యాకేజీ ఉపసంహరణపై పెడ్ రిజర్వ్ సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడితో పాటు క్రిప్టో మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత శుక్రవారం క్రిప్టో మార్కెట్ కుప్పకూలింది. ఇందులో బిట్ కాయిన్ ఆ ఒక్కరోజే ఏకంగా 12 శాతం పడిపోయి 36,000 డాలర్ల దిగువకు పడిపోయింది. జూలై నెల తర్వాత ఇదే కనిష్టం. నవంబర్ నెలలో బిట్ కాయిన్ 69,000 డాలర్ల మార్కును చేరుకుంది. ఆ రికార్డ్ గరిష్టంతో పోలిస్తే దాదాపు 50 శాతం పతనం.

క్రిప్టో పతనం
నవంబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం తర్వాత, నాటి నుండి బిట్ కాయిన్ రోజురోజుకు పడిపోతోంది. అడపాదడపా పుంజుకున్నప్పటికీ ముందుకు మాత్రం కదల్లేదు. పైగా దాదాపు సగం పడిపోయింది. 600 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ క్షీణించింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ 1 ట్రిలియన్ డాలర్లు పడిపోగా, అందులో అరవై శాతం వాటా బిట్ కాయిన్దే. డిజిటల్ కాయిన్స్ మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 42 శాతం వరకు ఉంది. ఎథేరియం కూడా 2500 స్థాయికి పడిపోయింది.

నేడు వివిధ క్రిప్టోలు ఇలా
ఈ వార్త రాసే సమయానికి వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ ఇలా ఉంది. బిట్ కాయిన్ $35,929.72 వారంలో 16.61% క్షీణించింది. మార్కెట్ క్యాప్ $679,154,903,686గా ఉంది.
ఎథేరియం $2,532, టెథేర్ $1.00, బిఎన్బీ $9.68, 388, యూఎస్డీ కాయిన్ $1.00, కార్డానో $1.15, సోలానా $104, ఎక్స్పీఆర్ $0.6231, టెర్రా $69.44, పోల్కాడాట్ $19.09, డోజీకాయిన్ $0.1422, అవాలాంచె $65.72, షిబా ఇను $0.00002345 వద్ద ఉన్నాయి.

మళ్లీ పుంజుకుంటుందా?
ప్రస్తుతం బిట్ కాయిన్ 35,000 డాలర్ల స్థాయిలో ఉంది. ఇది మళ్లీ పుంజుకుంటుందని, 53,000 డాలర్లను దాటుతుందని క్రిప్టో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులోనే 53,000 డాలర్లకు చేరుకోవచ్చునని సూచిస్తున్నారు. బిట్ కాయిన్ మద్దతు ధర ప్రస్తుత ధర కంటే ఎక్కువ స్థాయిలోనే 39,000కు పైన ఉందని అంటున్నారు. స్వల్పకాలానికి, మీడియం కాలానికి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చునని అంటున్నారు. త్వరలోనే ఇది పుంజుకోవచ్చునని చెబుతున్నారు. భారీ డిప్ సమయంలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయవచ్చుననేది ఆర్థిక నిపుణుల మాట తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ బడ్జెట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నిబంధనలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో పది రోజులు అప్రమత్తంగా కదలాడవచ్చు.