బంగారం@3,000 డాలర్లు-చమురు@65 డాలర్లు! ధరలు, రిటర్న్స్ ఎలా ఉంటాయంటే?
ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా రెండు కమోడిటీస్ ప్రధానంగా హైలెట్ అయ్యాయి. ఇందులో ఒకటి బంగారం, రెండోది క్రూడాయిల్. పసిడి ఆగస్ట్ నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోగా, చమురు ఏప్రిల్ నెలలో కనిష్టానికి చేరింది ఆ తర్వాత చమురు ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెలలో రష్యా వ్యాక్సీన్ వచ్చాక బంగారం ధర క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం దాదాపు నిలకడస్థాయిలో ఉంది. చమురు ధరలు పడిపోయినప్పుడు ఇన్వెస్టర్ల సంపద కుప్పకూలింది. అదే సమయంలో పసిడి ధర పెరగడంతో గత ఆరు నెలలుగా ఇన్వెస్టర్ల సంపద ఎగిసింది.
ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద, బంగారం ధర తగ్గడంతో...

చమురు వద్దు.. బంగారం ముద్దు!
ఈ ఏడాది ప్రధానంగా బంగారం, చమురు ధరల్లో ఎక్కువగా అస్థిరతలు చోటు చేసుకున్నాయి. 2020 క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో చమురు ధరలు బ్యారెల్ 60 డాలర్లకు పైన పలికింది. ఏప్రిల్ నెలలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ ధర ఓ సమయంలో నెగిటివ్ ధర పలికింది. తర్వాత 40 డాలర్లకు చేరుకుంది.
ప్రస్తుతం ఆ ధర వద్ద తచ్చాడుతోంది. కామెక్స్‌లో పసిడి ఔన్స్ ఏకంగా 2,075తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గి ఇప్పుడు 1950 డాలర్ల వద్ద ఉంది. ప్రపంచ దేశాల్లో కరోనా-లాక్ డౌన్ కారణంగా చమురు వినియోగం భారీగా పడిపోయింది. దీంతో డిమాండ్ తగ్గి, ధరలు పడిపోయాయి. గత కొద్ది నెలలుగా కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటుండటంతో డిమాండ్ అదే రకంగా పెరుగుతోంది. చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు బంగారం ధరలు అంతకంతకూ పెరగడంతో రష్యా వ్యాక్సీన్ వచ్చే వరకు పెట్టుబడులకు మొగ్గు చూపారు. ఆ తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

2022 నాటికి 3000 డాలర్లు.. ఆ తర్వాత 5000 డాలర్లు
బంగారం ధరల విషయానికి వస్తే తక్కువ వడ్డీ రేట్లు లేదా నెగిటివ్ వడ్డీ రేట్లు, ఆయా దేశాల ఆర్థిక ప్యాకేజీలు, ఆర్థిక అనిశ్చితులు, రాబోవు అమెరికా అధ్యక్ష ఎన్నికల వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. వీటితో ధరలు పెరుగుతాయి. చమురు ధరలు మాత్రం డిమాండ్‌కు అనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా, పసిడి ధరలు ఔన్స్ 5000 డాలర్ల దిశగా కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అయితే ఇది లాంగ్ టర్మ్‌లో అని చెబుతున్నారు. మీడియం టర్మ్‌లో పసిడి ధరలు 3,000 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. 2022 నాటికి పసిడి ధరలు 3000 డాలర్లకు చేరుకోవచ్చునని అంతర్జాతీయ బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం.. చమురు.. రిటర్న్స్
ముడి చమురు ధరలు ఇటీవల దిద్దుబాటును చూశాయి. మరికొంతకాలం చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడాది వ్యాక్సీన్ వస్తుందని భావిస్తున్నందున, ఆ తర్వాత చమురు ధరలు 10 డాలర్లు పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉదాహరణకు బ్రెంట్ క్రూడాయిల్ 2021 మూడో క్వార్టర్ నాటికి 65 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి, చమురు డిమాండ్ రికవరీ అనిశ్చితుల నేపథ్యంలో స్వల్పకాలంలో చమురు ధరలు ప్రస్తుత ధరల్లో ఉండటం లేదా స్వల్పంగా తగ్గుదల ఉండవచ్చునని, కానీ దీర్ఘకాలంలోను బంగారం సురక్షిత ర్యాలీగా భావిస్తూ ఇన్వెస్టర్లు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు వస్తువుల్లో బంగారం స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో భారీగా రిటర్న్స్ ఇస్తుండగా, చమురు మున్ముందు రిటర్న్స్ ఇచ్చేదిగా ఉంటుంది.