IPOలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈ విషయాలు తెలుసుకోండి
ఇటీవల ఐపీవోలు సందడి చేస్తున్నాయి. నేడు (నవంబర్ 8, 2021) పేటీఎం మాతృసంస్థ వన్97 ఐపీవో ఉంది. పలు సంస్థలు, స్టార్టప్స్ నిధుల సేకరణ కోసం స్టాక్ మార్కెట్లో ఐపీవోకు వస్తున్నాయి. ఈ వారం పేటీఎంతో పాటు కేఎఫ్‌సీ, పిజ్జాహట్ ఔట్ లెట్స్ నిర్వాహక సంస్థ సాఫైర్ ఫుడ్స్ ఇండియా, లాటెంట్ వ్యూ అనలటిక్స్ కూడా ఐపీవోసు వస్తున్నాయి. ఈ మూడు సంస్థలు ఐపీవోల ద్వారా రూ.21వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నవంబర్ 8న పేటీఎం, 9న సాఫైర్ ఫుడ్స్, 10న లేటెంట్ వ్యూ అనలటిక్స్ ఐపీవోకు వస్తున్నాయి.
పేటీఎం అత్యధికంగా రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. గతవారం ఐదు ఐపీవోలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 46 కంపెనీలు ఐపీవో ద్వారా రూ.80,102 కోట్ల సేకరణకు వెళ్లనున్నాయి. ఇది రూ.1 లక్ష కోట్లకు చేరువలో వెళ్తుందని అంచనా. 2017లో 36 సంస్థలు అత్యధికంగా ఐపీవోల ద్వారా రూ.67,147 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. గత ఏడాది 15 కంపెనీలు రూ.26,611 కోట్లు సమకూర్చుకున్నాయి.

ఐపీవోల సందడి
నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. ఈ పలు కంపెనీలు రూ.27,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) తో పాటు పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్, కేఎఫ్కీ-పిజ్జా హట్ నిర్వహణ సంస్థ సాఫైర్ ఫుడ్స్, అలంకార సౌందర్య సాధనాల సరఫరాదారు ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్, లాటెంట్ వ్యూ అనలటిక్స్ ఉన్నాయి.
ఇక నేడు ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ ఐపీవో, రేపు ఫినో పేమెంట్స్ ఐపీవో ముగియనుంది. వీటి కంటే మందు సెప్టెంబర్-అక్టోబర్‌లో వచ్చిన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ.2778 కోట్ల నిధులు సమీకరించింది. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు, ఈ నవంబర్ మిడిల్ నాటికి 46 కంపెనీలు ఐపీవోకు వచ్చినట్లు లెక్క.

ఐపీవో.. ఇవి గుర్తు పెట్టుకోండి
ఐపీవోలకు ఇటీవల క్రేజ్ పెరిగింది. కరోనా అనంతరం స్టాక్ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్టర్లు పెరిగారు. దీంతో ఐపీవోలకు కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. అయితే ఇన్వెస్ట్ చేసే సమయంలో పలు అంశాలను గుర్తు పెట్టుకోవాలి.
- ఐపీవోకు వచ్చినప్పుడు లిస్టింగ్ సమయంలో లాభాలు, అలాగే లాంగ్ టర్మ్ లాభాలను పరిగణలోకి తీసుకోవాలి. ఓ సంస్థ లిస్టింగ్‌కు వచ్చినప్పుడు ఆ స్టాక్ లిస్టింగ్ సమయంలో ఎంత వరకు, లాంగ్ టర్మ్‌లో ఎంత వరకు రిటర్న్స్ ఇస్తాయనే అంచనాలు ఉండాలి. ఉదాహరణకు IRCTC లేదా Dmart. వీటి లిస్టింగ్ సమయంలో వంద శాతం కంటే ఎక్కువగా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. కానీ ఈ స్టాక్స్ ఇప్పటికీ మీ చెంతనే అట్టిపెట్టుకుంటే మరింత మంచి రిటర్న్స్ మీ చేతిలో ఉండేవి.
- లిస్టింగ్ సమయంలో ప్రాఫిట్ పొందడానికి గాను మీ చేతిలో ఉన్న డబ్బును ఉపయోగించవచ్చు. అయితే లిస్టింగ్ ప్రాఫిట్ కంటే దీర్ఘకాలిక రిటర్న్స్ పైన దృష్టి సారించడం మంచిది.
- బుల్ పరుగు తరుచూ ఇన్వెస్టర్లను ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపేలా చేస్తుంది. అయితే కంపెనీ హిస్టరీ, పెరగడానికి దోహదపడిన కారణాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేయాలా వద్ద అనేది చూడాలి.
- పబ్లిక్ ఆఫర్‌కు ముందై నైకా, పాలసీ బజార్లు వరుసగా రూ.2,396, రూ.2,569 కోట్లు సమీకరించాయి. సెబి నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్ 30 రోజుల లాక్-ఇన్ వ్యవధి తర్వాత మాత్రమే తమ స్టాక్స్‌ను విక్రయించగలరు. షేర్ హోల్డర్లు/యాంకర్ ఇన్వెస్టర్లు మొదటి ముప్పై రోజులలో తమ స్టాక్స్‌ను విక్రయించలేరు. లాక్-ఇన్ పీరియడ్ 30 రోజుల తర్వాత జొమాటో స్టాక్స్ 8 శాతం క్షీణించాయి. కాబట్టి స్టాక్ కొనుగోలుకు లాక్-ఇన్ పీరియడ్ వరకు వెయిట్ చేయవచ్చా అనే అంశాన్ని పరిశీలించాలి. అలా వెయిటింగ్ చేయడం వల్ల స్టాక్ పెయిర్ ప్రైస్ నిర్ణయించడానికి కూడా దోహదపడుతుంది.
- నేడు చౌకగా ఉన్న స్టాక్స్ రేపు పుంజుకోవచ్చు. నేడు పుంజుకున్న స్టాక్స్ రేపు పడిపోవచ్చు. కాబట్టి పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
- ఐపీవో ఆదాయం ఎలా ఉపయోగించాలో పరిశీలించడం ముఖ్యం. కంపెనీ ఈ ఐపీవో మొత్తాన్ని కంపెనీ బలం పెంచుకోవడం కోసం, మార్కెట్ విస్తరణ కోసం ఉపయోగిస్తుందో తెలుసుకోవాలి.
- ఆయా కంపెనీ నిలదొక్కుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి కంపెనీ చరిత్ర, కంపెనీ ఫలితాలు ఎప్పటికి అప్పుడు చూసుకోవాలి.

అధిక రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ విషయానికి వస్తే చిన్న షేర్ల హవా కొనసాగింది. అయినా అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 7,333 పాయింట్లు (35.51 శాతం), మిడ్ క్యాప్ సూచీ 5,096 పాయింట్ల (25.25 శాతం) లాభపడ్డాయి. ఇదే సమయంలో బీఎస్ఈ 30 షేర్ల సూచీ 9,797 పాయింట్లు (19.78 శాతం) మాత్రమే పెరిగింది. ఇటీవల FII విక్రయాల బాట పట్టడంతో లార్జ్ క్యాప్ షేర్లు డీలా పడుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి.