రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఎగుమతులు, దిగుమతులపై నిర్మలమ్మ ఆందోళన
రష్యా, ఉక్రెయిన్ దేశాలకు ఎగుమతులపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత యుద్ధ సమయంలో ఇరు దేశాలకు ఎగుమతులు, దిగుమతులు ఇబ్బందికరమేనని సోమవారం అన్నారు. ఉక్రెయిన్‌కు తక్షణ దిగుమతులు, ఎగుమతులు కష్టంగా మారిందని, అలాగే, అక్కడి నుండి వచ్చే ఉత్పత్తులు కూడా ఎలా వస్తాయో తెలియని పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడి నుండి ఎగుమతులు, ముఖ్యంగా రైతాంగం గురించి ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ఐతే వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా తనకు అన్ని అంశాలు వచ్చాక కానీ పూర్తిగా చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితి మున్ముందు నిత్యావసరాల పైన ప్రభావం చూపవచ్చునన్నారు.
ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ దేశాలు గత కొద్ది రోజులుగా మాస్కోపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు కూల్చడమే లక్ష్యంగా ఆ దేశాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్విఫ్ట్ కోత పడింది. రష్యా కరెన్సీ రూబుల్ వ్యాల్యూ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 శాతం క్షీణించి 105.27 వద్ద ట్రేడ్ అవుతోంది. గత శుక్రవారం ఇది 84గా ఉంది.

రష్యా పైన చివరి అస్త్రంగా 200కు పైగా బ్యాంకుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్‌కు అనుసంధానంగా వ్యవహరించే స్విఫ్ట్ నుండి రష్యాను బహిష్కరించాయి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా కమిషన్. ఇప్పటి వరకు విధించిన ఆంక్షల్లో ఇది కఠినం. రూబుల్ పతనానికి ఇది ప్రధాన కారణం. స్విఫ్ట్ సమాచార వ్యవస్థ నుండి ఎంపిక చేసిన రష్యా బ్యాంకులను తొలగించారు. దీంతో ఆ బ్యాంకులు అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానం కోల్పోతున్నాయి. ఈ ప్రభావం ఐరోపా ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుంది. కానీ రష్యాను అడ్డుకునేందుకు ఈ చర్యకు దిగారు.