ప్రపంచంలోని బిట్ కాయిన్లన్నింటిని 25 డాలర్లకు కూడా కొనను: వారెన్ బఫెట్
బెర్క్‌షైర్ హాత్వే ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ క్రిప్టో కరెన్సీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు క్రిప్టోకు ఆదరణ పెరుగుతుంటే ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిప్టో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బిట్ కాయిన్ పైన ఆయన అనాసక్తి వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచలోని బిట్ కాయిన్లు అన్నింటిని కొనుగోలు చేయమని చెబితే, తాను కనీసం 25 డాలర్లకు కూడా కొనుగోలు చేసేది లేదని వ్యాఖ్యానించారు. అంటే 73.6 వేల కోట్ల విలువ చేసే బిట్ కాయిన్ల కోసం కనీసం 25 డాలర్లు వెచ్చించనని తేల్చి చెప్పారు.
బిట్ కాయిన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఒకవేళ కొనుగోలు చేసినా తిరిగి ఎవరికో విక్రయించాల్సిందే అన్నారు. బిట్ కాయిన్ కోసం తాను 25 డాలర్లు ఖర్చు పెట్టనని, కానీ అమెరికాలోని అపార్టుమెంటులలో కేవలం 1 శాతాన్ని అమ్మనా తాను 25 బిలియన్ డాలర్లు పెట్టి కొనడానికి సిద్ధమన్నారు.

ఇదిలా ఉండగా, క్రిప్టో మార్కెట్ నేడు సానుకూలంగా కదలాడుతున్నప్పటికీ, ఇటీవల క్షీణతతోనే ఉంది. బిట్ కాయిన్ 39వేల డాలర్లకు దిగువన ఉంది. ఈ వార్త రాసే సమయానికి ఈ క్రిప్టో దిగ్గజం 38,688 డాలర్లు, ఎథేరియం 2826 డాలర్లు, ఎక్స్ఆర్పీ 0.608656 డాలర్లు, టెర్రా 83.19 డాలర్లు, అవాలాంచె 61.26 డాలర్లు, టెర్రా యూఎస్డీ 1 డాలర్లు వద్ద ఉంది. మీమ్ కాయిన్స్ షిబా ఇను 0.000021 డాలర్లు, డోజీకాయిన్ 0.13 డాలర్లకు క్షీణించింది.