పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించింది? సిలిండర్ ధర రూ.1055 నుండి రూ.855కు తగ్గింపు
కరోనా మహమ్మారి, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా చమురురంగ సంస్థలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులు అల్లాడిపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం రెండోసారి వీటిపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి, ఊరటను కల్పించింది. గత ఎడెనిమిది నెలల కాలంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం రెండోసారి. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.10.91, లీటర్ డీజిల్ రూ.7.64 తగ్గింది.

రూ.1 లక్ష కోట్ల ఆదాయం డౌన్
ఎక్సైజ్ సుంకంలో తగ్గింపు నిర్ణయం వల్ల కేంద్రం ఏడాదికి రూ.1 లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పైన సుంకాన్ని తగ్గిస్తే వాహన వినియోగదారులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్ పైన రూ.200 వరకు రాయితీని ప్రకటించడం గమనార్హం.
ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులకు అవసరమైన ముడి సరుకులు, ఉపకరణాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. సిమెంట్ లభ్యత పెరగడంతో దాని ధరను తగ్గిస్తున్నారు.

అందుకే ధరల తగ్గింపు
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ఈ ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది. దీంతో హోల్ సేల్ ద్రవ్యోల్భణం 15.08 శాతానికి, రిటైల్ ద్రవ్యోల్భణం 7.79 శాతానికి చేరుకుంది. ఎనిమిదేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. సిమెంట్, స్టీల్ ధరలు పెరిగి ఇళ్ల నిర్మాణంపై ప్రభావం పడింది. దీంతో ఉపాధి కల్పన తగ్గింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాబడి గురించి ఆలోచనను పక్కన పెట్టి, సామాన్యులపై భారం తగ్గించే ఆలోచన చేసింది. ఉపాధి కల్పన పెంచే చర్యలు చేపట్టింది. అంతకుముందు నవంబర్ నెలలో కేంద్రం లీటర్ పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు మరో రూ.8, రూ.6 తగ్గించింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్ పైన కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూ.19.9, డీజిల్ పైన రూ.15.8గా ఉంది.
2020లో గరిష్టంగా పెట్రోల్ పైన రూ.32.9, డీజిల్ పైన రూ.31.8గా ఉంది. అంటే కేంద్రం నాటి నుండి నేటి వరకు పెట్రోల్ పైన రూ.13, డీజిల్ పైన రూ.16 తగ్గించింది. తెలంగాణలో పెట్రోల్ పైన వ్యాట్ 35.5 శాతం, డీజిల్ పైన 27 శాతంగా ఉంది.

ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్
ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైంజ్ సుంకాన్ని వసూలు చేస్తుంది. ఇందులో పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పైన రూ.19.90, డీజిల్ పైన రూ.15.80 ఉంది. ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్ అఢిషినల్, అడిషినల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో మూడు వేర్వేరు విభాగాల కింద విభజించింది.
ఇందులో పెట్రోల్ పైన బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్ రూ.1.40, డీజిల్ పైన రూ.1.80 వసూలు చేస్తోంది. ఇందులో పన్నును రాష్ట్రాలకు పంచుతుంది. ఇది కాకుండా రాష్ట్రాలు స్వయంగా వ్యాట్‌ను వసూలు చేస్తాయి.ఇక, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ పైన కేంద్రం రూ.200 రాయితీ అందిస్తోంది. ఈ తగ్గింపుతో రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది వినియోగదారులకు ఊరట కలిగింది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1055 ఉండగా, ఇది రూ.855కు తగ్గుతుంది.