పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పెరుగుదల ధర్మసంకటమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిని తగ్గించడం మినహా ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆ తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ఉత్పత్తులు తగ్గాయని, ఒపెక్ సహా ఉత్పత్తి దేశాలు ఎక్కువ లాభాల కోసం తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. దీంతో ఇంధనాన్ని వినియోగించే దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించవద్దని ఒపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలను కోరామన్నారు. పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించడం వల్ల భారత్‌పై ప్రభావం పడుతోందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు ఖర్చులు పెరిగాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు కోవిడ్ సెస్ కూడా విధించాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఈ ప్రభావం పడింది.

ధరల పెరుగుదల విపరీతమైన సమస్య అని, దీనికి ధరలు తగ్గించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నిర్మల అంతకుముందు అన్నారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సిన అంశమన్నారు. ఇది ధర్మసంకమైన అంశమని, ధరలు తగ్గించడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు. 'వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ధర్మ్ సంకటమైన పరిస్థితి'.