కంపెనీ చరిత్రలో తొలిసారి: టాటా రికార్డ్ బ్రేక్.. వొడాఫోన్ ఐడియా నష్టం రూ.50 వేలకోట్లు
ఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయం (AGR)పై సుప్రీం కోర్టు తీర్పు టెలికం కంపెనీలకు షాకిస్తున్నాయి. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మరో టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ రూ.23,045 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఈ రెండు కంపెనీల నష్టం దాదాపు రూ.74,000 కోట్లు. టెలికం వ్యాపారేతర ఆదాయం టెల్కోల స్థూల ఆదాయం కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనకు అనుకూలంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీ కింద టెల్కోలు... ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
AGR దెబ్బ: టెలికం కంపెనీల ఆందోళన

ఏ కంపెనీ నమోదు చేయని భారీ నష్టం.. రూ.50 వేల కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.50,921 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడం ద్వారా దేశీయంగా మరే సంస్థా ఓ త్రైమాసికంలో నమోదు చేయని నష్టాన్ని వొడాఫోన్ ఐడియా నమోదు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.4,874 కోట్ల నష్టాన్ని మాత్రమే ప్రకటించింది. అదే సమయంలో ఆదాయం రూ.7,878 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.11,146 కోట్లకు చేరుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ.44,150 కోట్లు చెల్లించాలి. ఇందులో రూ.25,680 కోట్లు ఈ క్వార్టర్లో కేటాయించినట్లు కంపెనీ తెలిపింది.

నష్ట అంచనాతో షేర్లు డౌన్
నెట్ వర్క్ 3G నుంచి 4G టెక్నాలజీకి మారడం వల్ల, వినియోగించని కొన్ని ఆస్తుల రూపేణ రూ.4,822 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం టెలికం కంపెనీలు తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించాయి. ఫలితాలపై ప్రతికాల అంచనాలతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎయిర్ టెల్ 0.81 శాతం నష్టంతో రూ.365.60 వద్ద, వొడాఫోన్ ఐడియా షేర్ 19 శాతం నష్టపోయింది.

ఎయిర్ టెల్ భారం రూ.23,045 కోట్లు
ఎయిర్ టెల్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలు నమోదు చేసింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రూ.23,045 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.119 కోట్ల లాభం ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి 4.7% వృద్ధి చెంది రూ.21,199 కోట్లకు చేరుకుంది. కానీ రూ.28,450 కోట్ల AGR బకాయిలకు కేటాయింపులతో నష్టం వచ్చింది. కంపెనీ చరిత్రలో అత్యధిక త్రైమాసిక నష్టం ఇది.

AGR భారం లేకుంటే...
సెప్టెంబర్ క్వార్టర్లో మొబైల్ టెలికాం సేవల ద్వారా కంపెనీ రూ.10,811 కోట్ల ఆదాయం ఆర్జించింది. మొదటి క్వార్టర్‌తో పోలిస్తే రూ.87 కోట్లు ఎక్కువ. ఏజీఆర్ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ.6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3 శాతం పెరిగి రూ.15,361 కోట్లకు చేరుకుంది. ఆఫ్రికా విభాగం ఆదాయం13 శాతం పెరిగింది.

టాటా మోటార్స్ నష్టం కంటే రెట్టింపు
కాగా, వొడాఫోన్ ఐడియా ప్రకటించిన రూ.50,921 కోట్ల నికర నష్టం ఓ త్రైమాసికంలో ఏ కంపెనీ ప్రకటించలేదు. 2018 డిసెంబర్ త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.26,961 కోట్ల నష్టం ప్రకటించింది. ఇప్పటి వరకు అధిక నష్టంగా నమోదయింది అదే. ఇప్పుడు వొడాఫోన్ ఐఢియా నష్టం రెట్టింపు కంటే ఎక్కువ.