దయచేసి మీ డబ్బంతా తీసుకోండి..డిస్కౌంట్ వద్దు, లోన్ తీసుకుంది నేను కాదు!: మాల్యా తిరకాసు
బ్యాంకుల నుండి వేలకోట్ల రూపాయలు రుణం తీసుకొని, వాటిని ఇంకా చెల్లించని కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా మరోసారి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న రుణానికి సంబంధించిన డబ్బులను తీసుకోవాలని కోరారు. నేను బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.. మీకు రావాల్సిన 100 శాతం ప్రిన్సిపల్ అమౌంట్ను తీసుకోండి.. అని మాల్యా కోరారు.
కరోనా వైరస్ ఎఫెక్ట్: అలీబాబా ఆందోళన, తట్టుకునే శక్తి ఉందా అంటే?

వంద శాతం మీ మొత్తాన్ని తీసుకోండి
తాను PMLA (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద ఎలాంటి నేరాలకు పాల్పడలేదని విజయ్ మాల్యా చెప్పారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం తన ఆస్తులను PMLA కింద జఫ్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రుణ విషయంలో ఎలాంటి తగ్గింపులు కోరడం లేదని, వంద శాతం మీ మొత్తాన్ని తీసుకోవాలని బ్యాంకులను కోరుతున్నానని చెప్పారు.

దయచేసి సొమ్ము తీసుకోండి
తాను తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం లేదని బ్యాంకులు ఫిర్యాదు చేయడంతో ఈడీ ఆస్తులను జఫ్తు చేసిందని, కానీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాను ఎలాంటి నేరం చేయలేదన్నారు. ఈడీ సుమోటోగా తన ఆస్తులను జఫ్తు చేసిందన్నారు. బ్యాంకులు దయచేసి తనకు రుణంగా ఇచ్చిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని, ఒకే రకమైన ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయన్నారు.

నేను అదే చెబుతున్నాను..
ఆస్తులను అటాచ్ చేయమని బ్యాంకులు చెబుతున్నాయని, తాను అదే చెబుతున్నానని, నేను ఇవ్వాల్సిన డబ్బులు తీసుకోమని చెబుతున్నానని విజయ్ మాల్యా అన్నారు.

వాస్తవానికి రుణం నేను తీసుకోలేదు.. కానీ
తాను ఈడీ నుండి డబ్బులు రుణంగా తీసుకోలేదని, వాస్తవానికి బ్యాంకుల నుండి కూడా నా కోసం కూడా నేను డబ్బులు తీసుకోలేదని, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ... బ్యాంకుల నుండి రుణం తీసుకుందని మాల్యా అన్నారు. ఈ రుణాలపై తన హామీని నెరవేరుస్తానని, పూర్తిగా చెల్లిస్తానని, ప్రిన్సిపల్ అమౌంట్లో ఎలాండి డిస్కౌంట్ తనకు అవసరం లేదన్నారు.

నాకు అలాంటి డిస్కౌంట్ అవసరం లేదు
చాలా బ్యాంకులు వివిధ కంపెనీలకు కొంత కత్తిరింపులతో ఊరట కలిగిస్తున్నాయని, తనకు అలాంటి డిస్కౌంట్ కూడా అవసరం లేదని మాల్యా అన్నారు. ప్రజా సొమ్మును ఉపయోగించుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు.

భారత్ తిరిగి రావడంపై..
భారత్ తిరిగి రావడం గురించి విజయ్ మాల్యా స్పందిస్తూ... తన కుటుంబం ఎక్కడ ఉంటే, తనకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండానని చెప్పారు. కాగా, ఆయన భారత్ తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.