భారత్లో నిరుద్యోగం తగ్గుతోంది: గుజరాత్, కర్నాటక సూపర్!
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) నుండి భారీ ఊరట చెందే వార్త! CMIE డేటా ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుతోంది. తద్వారా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని వెల్లడించింది. CMIE నెలవారీ డేటాను విడుదల చేసింది. భారత్లో ఫిబ్రవరి 2022లో నిరుద్యోగిత రేటు 8.10 శాతం కాగా, మార్చి నెల నాటికి 7.6 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 2వ తేదీ నాటికి 7.5 శాతానికి కూడా తగ్గినట్లు పేర్కొంది. అర్బన్ నిరుద్యోగిత రేటు 8.5 శాతానికి గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.1 శాతానికి తగ్గింది.
కరోనా తర్వాత మొత్తానికి నిరుద్యోగిత రేటు భారీగా తగ్గిందని, అయితే భారత్ వంటి పేద దేశానికి ప్రస్తుతం ఉన్న నిరుద్యోగిత రేటు ఎక్కువే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుముఖం పట్టడం చూస్తుంటే ఆర్థిక రికవరీ కనిపిస్తుందని వెల్లడవుతోందని అంటున్నారు. రెండేళ్ల క్రితం కరోనా సమయంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది.

CMIE డేటా ప్రకారం హర్యానాలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉంది. ఇక్కడ మార్చి నెలలో 26.7 శాతం, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలలో 25 శాతం చొప్పున, బీహార్లో 14.4 శాతం, త్రిపురలో 14.1 శాతంగా ఉంది. పశ్చిమ బెంగాల్లో 5.6 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత రేటు 7.97 శాతం కాగా, అదే ఏడది మే నాటికి 11.84 శాతంగా ఉంది. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలలో నిరుద్యోగిత రేటు తక్కువగా 1.8 శాతం మాత్రమే ఉంది.