ట్విట్టర్లో ఎలాన్ మస్క్ కలకలం: ఆ బిగ్‌షాట్‌ను ఆశ్రయించిన సోషల్ మీడియా జెయింట్
వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన తాజా ప్రతిపాదన.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో కలకలం రేపుతోంది. దీన్ని టేకోవర్ చేయడానికి ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి ట్విట్టర్ కంపెనీలో. ఈ ప్రతిపాదనలపై సమగ్రమైన అధ్యయనం చేయడానికి, అంచనాలను రూపొందించడానికి ట్విట్టర్ యాజమాన్యం.. అమెరికన్ కంపెనీని ఆశ్రయించింది. జేపీ మోర్గాన్ అండ్ కో సహకారాన్ని తీసుకోనుంది.
ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఎలాన్ మస్క్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని విలువ 43 బిలియన్ డాలర్ల పైమాటే. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆఫర్ ఇచ్చానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీన్ని మరింత అభివృద్ధి చేయొచ్చని, ఈ దిశగా తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తాననీ చెప్పుకొచ్చారు. తాను ప్రతిపాదించిన ఈ ఆఫర్‌ను ట్విట్టర్ యాజమాన్యం అంగీకరించకపోయినప్పటికీ- కంపెనీ షేర్‌హోల్డర్‌గా ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు చెల్లిస్తానని ఇస్తానని అన్నారు.

ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను అధ్యయనం చేయడానికి ట్విట్టర్ యాజమాన్యం.. జేపీ మోర్గాన్ సహాయాన్ని తీసుకోనుంది. కంపెనీ లాభనష్టాలను జేపీ మోర్గాన్ ద్వారా బేరీజు వేయనుంది. మస్క్ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించడం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు, తిరస్కరిస్తే ఎలాంటి పరిణామాలు సంభవించగలుగుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేయనుంది జేపీ మోర్గాన్. అనంతరం ఓ నివేదికను ట్విట్టర్ యాజమాన్యానికి అందజేస్తుంది. టెక్నాలజీ ఫోకస్డ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ థోమా బ్రేవో నుంచి కూడా సలహాలను స్వీకరించనుంది.
ఎలాన్ మస్క్ చేతికి తమ కంపెనీ వెళ్లిపోకుండా ఉండటానికి ట్విట్టర్ యాజమాన్యం ఇప్పటికే పాయిజన్ పిల్ ఫార్ములాను తెర మీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేట్ సెగ్మెంట్లో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వినియోగించే ఫార్ములా ఇది. దీన్ని అనుసరించడం ద్వారా మస్క్ దూకుడుకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. షేర్ హోల్డర్లకు డిస్కౌంట్ ధరకే మరిన్ని షేర్లను కేటాయించడాన్ని పాయిజన్ పిల్‌గా పిలుస్తారు. ఫలితంగా కంపెనీలో షేర్ల సంఖ్య, విలువ భారీగా పెరుగుతుంది. దీనివల్ల కంపెనీని టేకోవర్ చేయదలిచిన సంస్థ వేసిన అంచనాలకు మించిన స్థాయిలో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.