హైదరాబాద్ సహా కరోనా ముందుస్థాయికి రియాల్టీ పెట్టుబడులు
హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 2022లో ఐదు శాతం నుండి 10 శాతం పెరగవచ్చునని సీబీఆర్ఈ నివేదిక అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన గ్రాస్ ఆఫీస్ స్పేస్ అబ్సార్ప్షన్ 13 శాతం నుండి 14 శాతం పెరిగి, 45-47 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెరగవచ్చునని తెలిపింది. 2022లో 51-53 మిలియన్ స్క్వేర్ ఫీట్ కొత్త ఆఫీస్ స్పేస్ కార్యకలాపాలు ప్రారంభం కావొచ్చునని తెలిపింది. ఇది ఏడాది ప్రాతిపదికన 4 శాతం నుండి 5 శాతం పెరుగుదల.
కరోనా సెకండ్ వేవ్ పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బందులు ఎర్పడ్డాయి. ఇది రియాల్టీ రంగంపై ప్రభావం చూపింది. ఇప్పుడు పరిస్థితులు సర్దుకోవడంతో 6 నెలలుగా ఈ రంగంలో వృద్ధి నమోదు అవుతుంది. ఈ ఏడాది మొత్తం ఇది కొనసాగుతుందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ తెలిపారు. ఇండస్ట్రీ, లాజిస్టిక్ రంగాలు కరోనా ముందుస్థాయిలకు చేరుకున్నాయని, లీజింగ్ కార్యకలాపాలు పెరిగాయన్నారు.

అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల డిమాండ్ తగ్గి, ఆర్థిక వృద్ధి క్షీణించే అవకాశాలు ఉన్నప్పటికీ రియాల్టీ రంగం మాత్రం తట్టుకొని నిలబడుతుందన్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. హౌసింగ్ ప్రాజెక్టులు ఎక్కువగా వచ్చే అవకాశముంది. గోదాముల స్థలాల్లో 10 శాతం నుండి 20 శాతం వరకు వృద్ధి కనిపించే వీలు ఉంది. రియాల్టీ రంగంలో పెట్టుబడులు హైదరాబాద్‌కు అధికంగా ఉన్నాయి.