వేతనం 3 మిలియన్ డాలర్లే, స్టాక్స్‌తో కలిపి రూ.750 కోట్లు: ఉద్యోగి కంటే 1500 రెట్ల అధిక ఆదాయం
2021 క్యాలెండర్ ఏడాదిలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎంత వేతనం తీసుకున్నారో తెలుసా? సగటు ఆపిల్ ఉద్యోగి వేతనం కంటే 1447 రెట్లు అధిక వేతన అతనికి అందింది. అయితే 2020తో పోలిస్తే అతని వేతనం, సగటు ఉద్యోగి వేతనంతో పోలిస్తే చాలా తేడా ఉంది. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఆ ఏడాది కంపెనీ సీఈవోల వేతనాలపై ప్రభావం చూపింది. అయితే 2021లో ఉద్యోగుల పరిస్థితి పక్కన పెడితే కంపెనీ ఉన్నత ఉద్యోగులు, సీఈవోల, ప్రమోటర్ల ఆదాయం మాత్రం భారీగా పెరిగింది.

1447 రెట్లు అధికం
సగటు ఆపిల్ ఉద్యోగి వేతనంతో పోలిస్తే టిమ్ కుక్ 2021లో 1447 రెట్ల ఆదాయాన్ని అందుకున్నారు. అతను గత ఏడాది దాదాపు 100 మిలియన్ డాలర్ల శాలరీ తీసుకున్నారు. మీడియం ఆపిల్ ఉద్యోగుల మొత్తం వేతనం 2021లో 68,254 డాలర్లు కాగా, కుక్ తీసుకున్న మొత్తం 98.7 మిలియన్ డాలర్లు (రూ.750 కోట్లు). అదే సమయంలో 2020లో అతను తీసుకున్న వేతనం 14.8 మిలియన్ డాలర్లు మాత్రమే.
2020లో సగటు ఆపిల్ ఉద్యోగి వేతనం 57,783 డాలర్లు. కానీ టిమ్ కుక్ 256 రెట్లు ఎక్కువగా తీసుకున్నారు. 2020లో సగటు ఉద్యోగి వేతనంతో పోలిస్తే కేవలం 256 రెట్లు ఉండగా, 2021 నాటికి 1447 రెట్లు పెరిగింది.
2021లో సగటు ఉద్యోగి వేతనం 20 శాతం పెరగగా, కుక్ వేతనం 600 శాతం పెరిగింది.

శాలరీ 3 మిలియన్ డాలర్లే..
2021లో టిమ్ కుక్కు వచ్చిన మొత్తం 98.7 మిలియన్ డాలర్లలో అతని వేతనం 3 మిలియన్ డాలర్లుగా ఉంది. అతనికి ఎక్కువగా వచ్చింది స్టాక్స్ ద్వారా. ఈ స్టాక్స్ ద్వారా 82.3 మిలియన్ డాలర్లు అందుకున్నారు. ఆపిల్ మీటింగ్స్ టార్గెట్‌కు గాను 12 మిలియన్ డాలర్లను, ఎయిర్ ట్రావెల్‌కు గాను 1.4 మిలియన్ డాలర్లు అందుకున్నారు.
ఆపిల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ప్లాన్‌లో భాగంగా టిమ్ కుక్ సెప్టెంబర్ 2021లో 3,33,987 డాలర్లు అందుకున్నారు. 2023లో మరిన్ని అందుకోనున్నారు. 2015లో టిమ్ కుక్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తన ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగిస్తానని చెప్పారు.

పదేళ్లలో 1000 రెట్లు జంప్
జనవరి ప్రారంభంలో ఆపిల్ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఈ మార్కుకు చేరిన తొలి కంపెనీ ఇది. అయితే ఈ మార్కును చేరుకున్న కొద్ది గంటల్లోనే మళ్లీ పడిపోయింది. 2021లో ఆపిల్ కంపెనీ ఆదాయం 30 శాతం పెరిగింది. ఆదాయం 365.82 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. 2011 నుండి ఈ కంపెనీ స్టాక్స్ వెయ్యి రెట్లు లాభపడింది. అంటే పదేళ్లలో ఈ మేరకు పెరిగింది.