ఆ కంపెనీతో టాలెంట్ వార్, ఆ ఉద్యోగులకు ఆపిల్ రూ.1 కోటి బోనస్ ఆఫర్
ఆపిల్ ఇంక్ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కాపాడుకోవడానికి అసాధారణ స్టాక్ బోనస్‌లను జారీ చేసింది. సిలికాన్ డిజైన్, హార్డ్‌వేర్, సెలెక్ట్ సాఫ్టువేర్ అండ్ ఆపరేషన్ గ్రూప్స్‌లోని కొంతమంది ఉద్యోగులకు గతవారం ఔట్ ఆఫ్ సైకిల్ బోనస్‌ల గురించి తెలియజేసింది. ఈ మేరకు పరిమిత స్టాక్ యూనిట్లను జారీ చేస్తున్నారు. ఈ షేర్లు నాలుగేళ్ల పాటు ఐఫోన్ తయారీదారుల వద్ద ఉంటాయి. బోనస్‌గా వచ్చే ఈ మొత్తం పెద్ద ఎత్తున ఉంటుందని తెలుస్తోంది.

రూ.1 కోటికి పైగా వరకు బోనస్
ఈ బోనస్ 50,000 డాలర్ల నుండి 1,80,000 డాలర్ల మధ్య (రూ.1.35 కోట్లు) ఉంటుందని అంచనా. చాలామంది ఇంజినీర్లు దాదాపు 80,000 డాలర్లు, 1,00,000 డాలర్లు లేదా 1,20,000 డాలర్ల షేర్లను పొందినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఆంతరంగికంగా జరిగిందని తెలుస్తోంది. అధిక పనితీరును కనబరిచిన వారికి రివార్డుగా అందించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా టాప్ టాలెంట్‌కు 1,80,000 అయితే దీనిపై కంపెనీ స్పందించవలసి ఉంది.

మెటాతో టాలెంట్ వార్
ఆపిల్ ఇంక్ సిలికాన్ వ్యాలీ, వెలుపల ఉన్న కంపెనీలతో టాలెంట్ వార్ చేస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా నుండి టాలెంట్ వార్‌ను ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు మెటాకు వెళ్తున్నారు. మెటా గత కొద్ది నెలల్లోనే ఆపిల్ ఇంక్ నుండి 100 మంది ఇంజినీర్లను నియమించుకుంది.
అయితే ఆపిల్ ఇంక్ కూడా మెటా నుండి కీలకమైన ఉద్యోగులను ఆకర్షించింది. ఈ రెండు కంపెనీలు కూడా ఆగ్మెంటెడ్, వర్చువల్, రియాల్టీ హెడ్ సెట్స్, స్మార్ట్ వాచీలకు సంబంధించి గట్టి ప్రత్యర్థులుగా మారే అవకాశముంది. ఈ రెండు కూడా రాబోయే రెండేళ్లలో ప్రధాన హార్డ్వేర్స్ను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాయి.

ఆశ్చర్యకర బోనస్
ఈ చెల్లింపులు ఆపిల్ పరిహారం ప్యాకేజీలో భాగం కాదు. వీటిలో మూలవేతనం, స్టాక్ యూనిట్లు, నగదు బోనస్ ఉన్నాయి. ఆపిల్ కొన్నిసార్లు ఉద్యోగులకు అదనపు నగదు బోనస్‌ను అందిస్తోంది. అయితే తాజా స్టాక్ గ్రాంట్స్ పరిమాణం మాత్రం విలక్షణమైనది, ఆశ్చర్యకరం. ఆయా డివిజన్లలో పది శాతం నుండి ఇరవై శాతం వరకు ఇంజినీర్లకు ఇచ్చారు.
అయితే ఈ బోనస్ అంశం కొంతమంది ఉద్యోగులను నిరుత్సాహపరిచిందని తెలుస్తోంది. ఆపిల్ స్టాక్ 2021 సంవత్సరంలో 36 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.