కరోనా టైంలో ఈ ఉద్యోగాలు అదరగొట్టాయి, కారణాలివే..
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది నుండి అన్ని రంగాల్లో వృద్ధి పతనమై, నియామకాలు కూడా భారీగా క్షీణించాయి. కరోనా భయాలు, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉత్పత్తి పడిపోయి, ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే గత కొంతకాలంగా రికవరీ కనిపిస్తోంది. ఇది కూడా చాలా వేగంగా ఉంది. మార్చి 2021 నాటికి హైరింగ్ రికవరీ కూడా ఆశాజనకంగా ఉంది. కరోనాకు ముందు, కరోనా సమయంలోను టెక్ ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యత కనిపించింది. మార్చి చివరి నాటికి రికవరీ వేగంగా కనిపించింది. అదే సమయంలో భారత్‌లో పూర్తిస్థాయి హైరింగ్ 9 శాతం క్షీణించింది.
పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు, హైదరాబాద్‌లో ధర ఎంతంటే

టెక్నికల్ జాబ్ రోల్స్‌కు ప్రాధాన్యత
హైరింగ్ రికవరీ జూన్ 2020లో 51 శాతం క్షీణతతో ఉండగా, ఇప్పుడు మంచి వృద్ధిని నమోదు చేసినట్లు అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ పేర్కొంది. జనవరి 2020 నుండి ఫిబ్రవరి 2021 మధ్య డేటాను ఇది పరిగణలోకి తీసుకుంది. ఇండియా జాబ్ మార్కెట్లో కరోనా ప్రభావం పేరుతో దీనిని తీసుకు వచ్చింది. అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలబిలిటీ ఇంజినీర్ వంటి టెక్నికల్ జాబ్ రోల్స్ 150 శాతం నుండి 300 శాతం వరకు పెరిగాయి.

అందుకే పెరిగాయి
కంపెనీలు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కారం మీద నిరంతరం ఆధారపడటం, వర్క్ ఫ్రమ్ హోం విస్తరించడం, వ్యాపార సంస్థలు సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం వంటి అంశాలు టెక్ జాబ్స్ పోస్టింగ్స్ వృద్ధికి కారణాలని ఇండీడ్ తెలిపింది. ఫీల్డ్ ఇంజనీర్, సేల్స్ లీడ్, ఎడిటర్ వంటి ఉద్యోగాలకు యాజమాన్యాల నుండి 55 శాతం నుండి 85 శాతం డిమాండ్ ఉందని తెలిపింది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పుణే, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అన్ని రంగాలలో జాబ్స్ పోస్టింగ్స్ పెరిగాయి.

నగరాల్లో వృద్ధి
రిటైల్, బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ పోస్టింగ్ కేంద్రీకృతమైన కోల్‌కతాలో మినహా మిగతా అన్ని మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలలో వృద్ధి కనిపించినట్లు వెల్లడించింది. ఈ కరోనా కాలంలో కాలర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు క్షీణించాయి. కరోనా తర్వాత నుండి ప్రపంచం డిజిటల్ వైపు వేగంగా పరుగెడుతోంది.