చందా కొచ్చర్‌కు హైఓల్టేజ్ షాక్: జోక్యం చేసుకోలేం: బోంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఐసీఐసీఐ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందా కొచ్చర్‌కు మరోమారు హైఓల్టేజ్ షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్ఫష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటోన్న చందా కొచ్చర్ ఇదివరకు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

సమాచారం ఇవ్వకుండా ఉద్వాసన..
ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు చందా కొచ్చర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ బ్యాంకు యాజమాన్యం ఆమెను తొలగించింది. దీనికోసం ఎలాంటి కారణాన్ని చూపలేదు. అలాగని- ఎలాంటి ముందస్తు సమాచారాన్ని కూడా చందా కొచ్చర్‌కు ఇవ్వలేదు. గత ఏడాది ఆమెను ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసన పలికింది.

బాంబే హైకోర్టులో సవాల్ చేసినా..
ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను తొలగించడాన్ని చందా కొచ్చర్ తప్పు పట్టారు. దీనిపై బోంబే హైకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేపిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది బోంబే హైకోర్టు. విచారణ అనంతరం ఐసీఐసీఐ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆమెను తొలగించడం సరైనదేనని పేర్కొంది. బోంబే హైకోర్టు తీర్పును చందా కొచ్చర్ అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

చందా తరఫున ముకుల్ రోహత్గీ
చందా కొచ్చర్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఆమె తరఫున తన వాదనలను వినిపించారు. కంపెనీల చట్టం ప్రకారం.. ఎలాంటి ముందస్తు సమాచారాన్ని ఇవ్వకుండా ముఖ్య కార్యనిర్వహణాధికారి స్థాయిలో ఉన్న వ్యక్తిని తొలగించడం సరికాదని పేర్కొన్నారు. కంపెనీస్ యాక్ట్‌ను ఉల్లంఘించినట్లు స్పష్టమౌతోందని వాదించారు. వాదోపవాదాలను విన్న తరువాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

జోక్యం చేసుకోలేమన్న సుప్రీం..
బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆర్థిక నేరాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బోంబే హైకోర్టు జారీ చేసిన తీర్పుపై స్టే ఇవ్వలేమని అన్నారు. ఐసీఐసీఐ సీఈఓగా ఉన్న కాలంలో చందా కొచ్చర్ వీడియో కాన్ సంస్థకు 1,875 కోట్ల రూపాయలను మళ్లించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, అప్పటి వీడియో కాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ ధూత్‌పై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది.