అంతంతే: ఉద్యోగులకు పండుగ బొనాంజా ప్యాకేజీపై మూడీస్
భారత ప్రభుత్వం ఇటీవల రూ.46,675 కోట్ల డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలు తీసుకుంది. ఇది భారత జీడీపీలో 0.2 శాతం. అయితే ఈ రెండో ఉద్దీపన భారత ఆర్థిక వ్యవస్థకు అంతంత మాత్రమే ఊతమిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ గురువారం పేర్కొంది. డిమాండ్, ఆర్థికవృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రకటించిన తాజా ఉద్దీపన స్వల్ప ప్రయోజనాలు అందిస్తుందని తెలిపింది. మూడు రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్యాకేజీపై ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) క్యాష్ వోచర్ స్కీం, ప్రత్యేక పండుగ అడ్వాన్స్, రాష్ట్రాలకు వడ్డీరహిత రూ.12,000కోట్ల రుణం, రూ.25,000 కోట్ల అదనపు మూలధన ప్రయోజనాలు కల్పించింది కేంద్రం.

ఆర్థిక చర్యలు ఓకే.. ఉద్దీపన ప్రభావం తక్కువ
ప్రభుత్వం తీసుకునే ఆర్థిక చర్యల తీరు బాగున్నప్పటికీ, ఉద్దీపన చిన్నదని, కాబట్టి ఆర్థిక వృద్ధికి అంతగా మద్దతు ఇఛ్చేది కాదని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి సంబంధిత పరిమితులు సడలించడం, దేశంలో ఫెస్టివెల్ సీజన్ ప్రారంభం కావడం వంటి తాజా చర్యలవల్ల ఈ ఉద్దీపన సమీపకాలంలో వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, అయితే ప్యాకేజీ చిన్నదని, కాబట్టి వృద్ధికి మద్దతు తక్కువగా ఉంటుందని తెలిపింది. 2020లో తాము అంచనా వేసిన 11.5 శాతం ప్రతికూలతకు ఈ ప్యాకేజీ ప్రోత్సహం చిన్నదని పేర్కొంది.
13 ఏళ్ల రికార్డ్‌కు బ్రేక్, రూ.3.28 లక్షల కోట్ల సంపద ఆవిరి: మూడీస్ హెచ్చరిక

రుణారం
రెండు విడతల్లోని ఉద్దీపనల ప్యాకేజీలను కలుపుకుని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యక్ష వ్యయాలను పరిశీలిస్తే ఈ మొత్తం జీడీపీలో 1.2 శాతమేనని మూడీస్ పేర్కొంది. బీఏఏ రేటింగ్ ఉన్న ఇతర దేశాల్లో కరోనా సంబంధ ఉద్దీపన జీడీపీలో సగటును 2.5 శాతం ఉందని తెలిపింది. వ్యయాల విషయంలో భారత్ కఠిన పరిమితుల్ని ఎదుర్కొంటోందని తెలిపింది. జీడీపీలో ప్రభుత్వ రుణభారం గత ఏడాది 72 శాతంగా ఉంటే 2020లో దాదాపు 90 శాతానికి చేరుకోనుందని తెలిపింది. ఇదే రేట్ కలిగిన దేశాల కంటే 59 శాతం ఎక్కువ. ఆదాయాలు తగ్గడంవల్ల ద్రవ్యలోటు జీడీపీలో 12 శాతానికి పెరిగిపోవచ్చునని అంచనా వేసింది. గత ఏడాది ఇది 6.5 శాతంగా ఉంది.

జీడీపీ పెరుగుతుంది
ఏదేమైనా కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నందున 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ ప్రతికూలత నమోదు చేసినప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.6 శాతానికి పుంజుకోవచ్చునని మూడీస్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలత నమోదు చేసినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటుందని వివిధ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.