తెలుగు రాష్ట్రాలు సహా.. ఉచిత వ్యయాలు ఆందోళనకరం: తెలంగాణ ఆదాయంలో 35% వాటికే
దేశంలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న ప్రజాకర్షక, ఉచిత పథకాలతో భవిష్యత్తులో ఆర్థిక విపత్తు సంభవించే అవకాశముందని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక వెల్లడించింది. కరోనాతో అస్తవ్యస్తమైన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఉచిత పథకాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఉచిత పథకాలతో ఆర్థికంగా సమస్య ఎదుర్కొనే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు తమ ఆదాయంలో 5 శాతం నుండి 19 శాతం వరకు రుణ మాఫీ, ఉచిత పథకాలకు ఖర్చు చేస్తున్నాయని, ఇది ఆయా రాష్ట్రాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వెల్లడించింది.

రుణ మాఫీ, పెన్షన్ వ్యవస్థ
రుణాలు మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం వంటి ఆర్థికంగా నిలబడలేని ఉచితాలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే అంశమని ఎస్బీఐ రీసెర్చ్ ఏప్రిల్ 18వ తేదీ నాటి తన నివేదికలో తెలిపింది. తెలంగాణలో ప్రజాకర్షక పథకాల కారణంగా వీటి కోసం రాష్ట్ర ఆదాయంలో 35 శాతం ఉచిత పథకాలకే ఖర్చు అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక, కేంద్రం నుండి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టి, కేవలం రాష్ట్ర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ ఉచితాల ఖర్చు ఏకంగా 63 శాతంగా ఉందని పేర్కొంది. ఇది శ్రేయస్కరం కాదని అభిప్రాయపడింది.

ఆర్థిక విపత్తుకు కారణం
జనాకర్షక పథకాల కోసం ఆదాయంలో 35 శాతం నుండి 65 శాతం వరకు ఖర్చు చేయడం ఎక్కువ కాలం సాధ్యం కాదని, ఆర్థిక విపత్తుకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు తమ ఆదాయంలో 5 శాతం నుండి 19 శాతం వరకు ఉచిత లేదా జనాకర్షక పథకాల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం రాష్ట్రాల ఆదాయంలో ఇది 53 శాతం నుండి 63 శాతంగా ఉంది.

జీడీపీ కంటే ఎక్కువ
బీహార్, అసోం రాష్ట్రాలు తమ ఆర్థిక లోటును గణనీయంగా అధిగమించాయని ఈ నివేదిక తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ కూడా ఆర్థిక లోటును ఎక్కువగా నమోదు చేశాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యాన్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జీఎస్డీపీ వృద్ధిని.... జీడీపీ కంటే ఎక్కువగా చూపుతున్నట్లు పేర్కొంది. పదిహేడు రాష్ట్రాల జీఎస్డీపీ జీడీపీ కంటే ఎక్కువగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.