LIC, Paytm: ఇన్వెస్టర్లకు రక్తకన్నీరే: మునిగిన రూ.వేల కోట్లు
ముంబై: ఎల్ఐసీ.. పేటీఎం. ఈ రెండూ దేశంలో బిగ్గెస్ట్ పబ్లిక్ ఇష్యూలుగా ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. పేటీఎం 18,500 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేయగా.. ఎల్ఐసీ దీన్ని మించిన లక్ష్యాన్ని పెట్టుకుంది. 21,000 కోట్ల రూపాయలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఇంత భారీ టార్గెట్‌ను పెట్టుకుని దేశీయ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన కంపెనీలేవీ లేవు.
Business Ideas: నర్సరీల ద్వారా రూ. లక్ష వరకు ఆదాయం: ఉపాధి హామీ పథకంతో లింక్

ఆకాశమంత అంచనాలతో..
ఈ రెండు ఐపీఓల మీద ఇన్వెస్టర్లలో ఉన్న అంచనాలు.. ఆకాశమంత. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో వినపడుతున్న పేర్లు కావడం వల్ల.. వాటి షేర్లను కొనుగోలు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. కొద్దో, గొప్పో లాభాలు వస్తాయని ఆశించారు. కొత్తగా స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టిన వారిలో దాదాపు 70 శాతం ఈ రెండింట్లోనూ ఇన్వెస్ట్ చేశారనేది మార్కెట్ వర్గాల అంచనా. బాగా తెలిసిన కంపెనీలు కావడం వల్ల గుడ్ రిటర్న్స్ వస్తాయనే ఆశతో వాటిల్లో పెట్టుబడులు పెట్టారు.

గుండెల్లో బాంబులు..
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ రోజు మాత్రం ఇన్వెస్టర్ల గుండెల్లో బాంబులు పేల్చాయి.. ఈ రెండు కంపెనీలు కూడా. నష్టాలతో లిస్టింగ్ అయ్యాయి. ఒక్కో షేర్ మీద వందల రూపాయల్లో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఈ నష్టం ఎప్పుడు పూడుతుందనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి మార్కెట్లో నెలకొని ఉంది. బ్లాక్ బస్టర్ ఐపీఓలుగా నిలుస్తాయనుకున్న ఈ రెండు కూడా దారుణంగా దెబ్బకొట్టాయి.

తొలి రోజు నుంచే..
గత ఏడాది నవంబర్‌లో పేటీఎం ఐపీఓ జారీ అయింది. దాని ప్రైస్‌బ్యాండ్ 2,080 నుంచి 2,150 రూపాయలతో ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఇంత భారీ రేట్ పెట్టినప్పటికీ.. ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. వీరిలో కొత్తగా మార్కెట్లోకి వచ్చినవారి సంఖ్యే అధికం. లిస్టింగ్ రోజున సినిమా చూపించింది. ఏకంగా 1,564.15 రూపాయలతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయింది. 2,150 రూపాయలను పెట్టి కొనుగోలు చేసిన ఒక్క షేర్.. లిస్టింగ్ రోజే 500 రూపాయల నష్టాన్ని ఇచ్చింది.

మార్కెట్లు బాగున్నా..
ఆ తరువాత ఏ దశలో కూడా పేటీఎం షేర్లు పుంజుకోలేదు. ఓ సందర్భంగా 1,700 రూపాయల మార్క్‌ను దాటగలిగింది. ఆ తరువాత అంతా నేలచూపులే. శుక్రవారం పేటీఎం షేర్ల ట్రేడింగ్ 590.70 రూపాయల వద్ద ముగిసింది. ఒక్కో షేర్ మీద 900 రూపాయలకు పైగా నష్టాన్ని మిగిల్చిన పబ్లిక్ ఇష్యూ ఇది. స్టాక్ మార్కెట్ భారీగా లాభపడ్డ సమయంలోనూ పేటీఎం షేర్లల్లో మాత్రం ఎలాంటి కదలిక కనిపించకపోవడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఎల్ఐసీదీ అదే దారి..
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎల్ఐసీదీ అదే దారి. తొలి రోజు నాడే భారీ షాక్ ఇచ్చిందీ బిగ్గెస్ట్ ఐపీఓ. 21,000 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. ఏ మాత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. 905 నుంచి 949 రూపాయల ప్రైస్ బ్యాండ్ ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో భారీ నష్టానికి లిస్టింగ్ అయింది. తొలి నాలుగు రోజుల్లో 77,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశారు ఇన్వెస్టర్లు. శుక్రవారం దీని ట్రేడింగ్ రూ.825.30 పైసల వద్ద ముగిసింది.