Market crash: 838 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, ఐనా నష్టాల్లోనే క్లోజ్
అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెంపు, చమురు ధరల మంట, బడ్జెట్ నేపథ్యంలో దిద్దుబాటు, వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. ఇలా పలు అంశాలు నేడు మార్కెట్ భారీ నష్టాలకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఓ సమయంలో 1400 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్లు కనిపించడంతో సూచీలు కాస్త పైపైకి కదలాయి. అయితే ఇది నష్టాల నుండి మాత్రం గట్టెక్కించలేకపోయింది. అతి భారీ నష్టం నుండి భారీ నష్టాలతో మార్కెట్ ముగియడానికి మాత్రమే ఉపయోగపడింది. ప్రధానంగా చివరలో బ్యాంకింగ్ రంగం పుంజుకుంది. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. మధ్యాహ్నం 1400 పాయింట్లు పతనమైనా, చివరి రెండు గంటల్లో కాస్త నష్టాలను తగ్గించుకుంది.

838 పాయింట్లు అప్
సెన్సెక్స్ 57,317 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,508 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,439 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 581 పాయింట్లు లేదా 1 శాతం నష్టపోయి 57,277 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ సమయంలో 1400 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్ నేటి కనిష్టం నుండి 838 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 17,062 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,182 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,866 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 167 పాయింట్లు లేదా 0.97 శాతం నష్టపోయి 17,110 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నేటి కనిష్టం నుండి 240 పాయింట్లకు పైగా ఎగిసింది.

పేటీఎం భారీ పతనం
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 21 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 5 శాతం లాభపడింది. ఐటీ ఇండెక్స్ మాత్రం నష్టపోయింది. జొమాటో స్టాక్స్ 10 శాతం పతనమయ్యాయి. హెచ్‌సీఎల్ స్టాక్ 4 శాతం క్షీణించింది. పేటీఎం షేర్ అయితే నేడు 2.60 శాతం నష్టపోయి రూ.891 వద్ద ముగిసింది. రూ.2000కు పైన ఇష్యూ ధర కాగా, రూ.1950 వద్ద లిస్ట్ అయిన ఈ షేర్, అప్పటి నుండి క్రమంగా పడిపోతోంది. నేడు ఓ సమయంలో రూ.881కి పడిపోయాయి. ఈ స్టాక్ ఆల్ టైమ్ కనిష్టం రూ.875, ఆల్ టైమ్ గరిష్టం రూ.1955. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.57 వేల కోట్లుగా ఉంది.
ఇన్వెస్టర్ల సంపద వారం రోజుల్లో రూ.17 లక్షల కోట్లు క్షీణించింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, మారుతీ సుజుకీ, సిప్లా, కొటక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టీసీఎస్, విప్రో ఉన్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.2.59 లక్షల కోట్లకు తగ్గింది.