రెండు రోజుల లాభాలకు బ్రేక్, నేడు మరింత క్షీణించిన ఎల్ఐసీ
స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం, మే 18) నష్టాల్లో ముగిశాయి. వరుస రెండురోజుల లాభాల అనంతరం నేడు మళ్లీ కిందకు పడిపోయాయి. ఉదయం కాస్త సానుకూలంగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ, అది కూడా కాసేపు మాత్రమే. దీంతో మళ్లీ నష్టల్లోకి వెళ్లి, ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 54,554.89 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,786.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,130.89 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 110 పాయింట్లు క్షీణించి 54,208 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 16,240 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు స్వీకరణకు మొగ్గు చూపారు. ఇదిలా ఉండగా, ఎల్ఐసీ స్టాక్ నేడు మరింత క్షీణించింది. నేడు 0.057 శాతం తగ్గి రూ.874.75 వద్ద ముగిసింది.

ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాలు గత కొద్ది రోజులుగా మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అయినప్పటికీ సూచీలు ఇటీవల రాణించాయి. కానీ అంతలోనే నష్టాల్లోకి వెళ్లాయి. మార్కెట్ ప్రస్తుతం స్థిరీకరణ దిశగా కనిపిస్తోంది. హోల్ సేల్ ద్రవ్యోల్భణం ఏప్రిల్ నెలలో 15.8 శాతానికి చేరుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్లను అవసరమైతే వేగంగా పెంచుతామని చెప్పడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతోంది.