లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: పేటీఎం 40% పైగా పతనం
స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 11, 2022) లాభాల్లో ముగిశాయి. నిన్న 650 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్, నేడు మరో 220 పాయింట్లకు పైగా ఎగిసింది. సెన్సెక్స్ నేడు ఉదయం 60,342.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,689.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,281.52 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,997.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,081.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,964.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 221 పాయింట్లు ఎగిసి 60,616 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు ఎగిసి 18,055 పాయింట్ల వద్ద ముగిసింది.

కాసేపు ఊగిసలాట
ఉదయం కాసేపు ఊగిసలాటలో కనిపించినప్పటికీ అంతలోనే లాభాల్లోకి వచ్చాయి సూచీలు. ఇక అప్పటి నుండి ఏ దశలోను నష్టాల్లోకి జారుకోలేదు. కానీ లాభాల్లోనే పైకీ, కిందకు కదలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 18 స్టాక్స్ లాభపడగా, 12 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ భారీగా లాభపడింది. టాటా స్టీల్ భారీగా నష్టపోయింది. ఐటీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ లాభాలకు ఊతమిచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నేడు లాభపడింది.

అందుకే వొడా భారీ నష్టం
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, HDFC, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో JSW స్టీల్, టాటా స్టీల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, హిండాల్కో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే సూచీలు సానుకూలంగా ఉన్నాయి. మూడో త్రైమాసికం ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో గత రెండు సెషన్లుగా సూచీలు భారీగా లాభపడ్డాయి. దీంతో నేడు ఒత్తిడిలో కనిపించింది. వొడాఫోన్ ఐడియా బకాయిల కింద ప్రభుత్వానికి ఈక్విటీలు కేటాయించటనున్నట్లు ప్రకటన రావడంతో టెలికం రంగ షేర్లు నష్టపోయాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ బకాయి కింద ఈక్విటీలను కేటాయించనున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించడంతో 21 శాతం నష్టపోయాయి.

40 శాతం పడిపోయిన పేటీఎం
పేటీఎం షేర్లు ఆల్ టైమ్ గరిష్టానికి పడిపోయాయి. మెక్వైరీ... పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ టార్గెట్ ధరను రూ.900కు తగ్గించింది. అలాగే షేర్ రేటింగ్ అండర్ పర్ఫార్మర్గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ కంపెనీ షేర్లు దాదాపు 3.6 శాతం మేర కుంగిపోయి రూ.1116.50 వద్ద ముగిశాయి. ఈ స్టాక్ లిస్టింగ్ నుండి 40 శాతానికి పైగా నష్టపోయింది. ఈ స్టాక్ నవంబర్ 18న లిస్ట్ అయింది.