స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు, HCL టెక్ భారీ నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (జనవరి 17, 2022) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత స్వల్ప లాభనష్టాల్లోనే ఊగిసలాడింది. చివరకు 85 పాయింట్ల లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 61,219.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,385.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 61,107.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,235.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,321.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,228.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 85.88 (0.14%) పాయింట్లు ఎగిసి 61,308.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52.35 (0.29%) పాయింట్లు లాభపడి 18,308.10 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 19 స్టాక్స్ లాభపడగా, 11 స్టాక్స్ నష్టపోయాయి. అల్టా టెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ రెండు శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. ఇక ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ స్టాక్ అత్యధికంగా 5.76 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ, HDFC, యాక్సిస్ బ్యాంకు వంటివి నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా వంటి ఫార్మా స్టాక్స్ కూడా నష్టపోయాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ నేటి సెషన్లో 9 పైసలు క్షీణించి 74.2 వద్ద ముగిసింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, గ్రాసీమ్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్, HDFC బ్యాంకు, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంకు, సిప్లా ఉన్నాయి.
ఈ నెలలో సూచీలు ఇప్పటికే ఐదు శాతం లాభపడ్డాయి. ఈ వారం దాదాపు స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. ప్రీబడ్జెట్ ర్యాలీ సూచీల సానుకూలతకు దోహదం చేశాయి.