లిస్టెడ్ కంపెనీల్లో సీఈవో, చైర్పర్సన్ పదవులు మీ ఇష్టం!
కార్పోరేట్లకు భారీ రిలీఫ్! లిస్టెడ్ కంపెనీలలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్/సీఈవో అధికారి పదవుల విభజన నిబంధనను ప్రస్తుతానికి తప్పనిసరి చేయడం లేదని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తెలిపింది. కంపెనీలు స్వచ్చంధంగా పాటించవచ్చునని వెల్లడించింది. 2022 ఏప్రిల్ నాటికి లిస్టెడ్ కంపెనీలు పదవుల విభజనను చేపట్టవలసి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ నిబంధనలను పాటించడం ఆశించిన స్థాయిలో లేదు.
పదవుల విభజనపై కంపెనీల అభిప్రాయాలను సెబి తెలుసుకోవాలని ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ నేపథ్యంలో సెబి తాజా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి చైర్మన్, ఎండీ, సీఈవోల విభజనకు 2020 ఏప్రిల్ 1ని గడువు తేదీగా ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే పరిశ్రమ ప్రతినిధుల వినతులను పరిగణలోకి తీసుకొని, గడువును రెండేళ్లు పొడిగించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా అంతరాయాలు ఏర్పడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో గడువును పొడిగించాలని మరోసారి పరిశ్రమ కోరింది.

టాప్ 500 లిస్టెడ్ కంపెనీల్లో పదవుల విభజన నిబంధనలను పాటించిన సంస్థలు సెప్టెంబర్ 2019 వరకు 50.4 శాతం ఉండగా, 2021 డిసెంబర్ 31 నాటికి కేవలం 54 శాతానికి పెరిగింది. ఈ మేరకు సెబి వెల్లడించింది. రెండేళ్లలో 4 శాతం పెరిగినప్పుడు రెండు నెలల్లో మరో 46 శాతం పెరగడం అసాధ్యమని భావిస్తున్నట్లు తెలిపింది.