LIC IPO: మరోసారి ఐపీవో కోసం ఎల్ఐసీ దరఖాస్తు
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మరోసారి ఐపీవో కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కు దరఖాస్తు చేసుకుంది. ఈసారి తాజా వివరాలతో కూడిన ప్రాథమిక పత్రాలను సమర్పించింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను కూడా జత చేసి, పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరింది. ఫిబ్రవరి 13వ తేదీన ఎల్ఐసీ తొలిసారి సెబికి ఐపీవో కోసం దరఖాస్తు చేసుకుంది.
అప్పుడు సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసిక ఫలితాలతో కూడిన పత్రాలను సమర్పించింది. దీనికి ఈ నెల ఆరంభంలో సెబి ఆమోదం కూడా తెలిపింది. దీని ప్రకారం పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు ఎల్ఐసీకి మే 12వ తేదీ వరకు గడువు ఉంది. లేదంటే నిబంధనల ప్రకారంతాజా సమాచారంతో మరోసారి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

కానీ సంస్త ఈ లోపే రెండోసారి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. తద్వారా పబ్లిక్ ఇష్యూ ప్రారంభించేందుకు కావాల్సిన గడువు మరింత పెరగనుంది. తద్వారా మార్కెట్లలో స్థిరత్వం వచ్చే వరకు వేచి చూసేందుకు ప్రభుత్వానికి సమయం ఉంటుంది.