SBI Q4 results: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్లకు గ్రేట్ న్యూస్
ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ ఉన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. 41 శాతం మేర నికర లాభాలను అందుకుంది. దీని విలువ 9,113.50 కోట్ల రూపాయలు. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎస్బీఐ నమోదు చేసిన నికర ఆదాయం 6,450.75 కోట్ల రూపాయలు. కాగా దీన్ని భారీగా పెంచుకోగలిగింది. 9,113.50 కోట్ల రూపాయలకు చేర్చింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి విడుదల చేసింది. వాటిని రెగ్యులేటరీకి సమర్పించింది. జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి సంబంధించిన కార్యకలాపాల వివరాలను ఇందులో పొందుపరిచింది. గత ఆర్థిక సంవత్సర అన్ని త్రైమాసిక కాలాలను కలుపుకొని చూస్తే చివరి మూడు నెలల కాలంలోనే అత్యధిక నికర లాభాలను ఆర్జించింది ఎస్బీఐ.

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగు త్రైమాసికాలను కలుపుకొంటే మొత్తం నికర లాభాల విలువ 31,676 కోట్ల రూపాయలకు చేరింది. ఇందులో 55.19 శాతం మేర వృద్ధిని సాధించింది. ఏడాది మొత్తానికీ వడ్డీల ద్వారా ఎస్బీఐ సాధించిన నికర ఆదాయంలో భారీగా పెరుగుదల కనిపించింది. అంతకుముందు 2021 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15.26 శాతం మేర నికర వడ్డీ ఆదాయం పెరిగింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు ఇదే.
2021లో నికర వడ్డీ ఆదాయం 27,067 కోట్ల రూపాయలు ఉండగా.. ఈ సారి ఈ సంఖ్య 31,198 కోట్లకు చేరింది. డొమెస్టిక్ నెట్ ఇంటరెస్ట్ మార్జిన్‌లోనూ పెరుగుదలను చూపించింది. 29 బేసిస్ పాయింట్లతో 3.40 మేర పెరిగినట్లు తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి తగ్గింది. సంవత్సరం మొత్తానికీ 1.02 శాతం మేర తగ్గినట్టు ఫోర్త్ క్వార్టర్ ఫలితాల్లో ఎస్బీఐ పేర్కొంది. డొమెస్టిక్ అడ్వాన్సులు-10.27, రిటైల్ పోర్ట్‌ఫోలియో 10 లక్షల కోట్ల రూపాయల మార్క్‌ను దాటింది.
ఎస్బీఐ మొత్తం డిపాజిట్ల శాతం 10.06 మేర పెరిగింది. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ 10.45, టర్మ్ డిపాజిట్స్ 11.54 శాతంగా నమోదు చేసింది. కాగా- భారీ లాభాలను నమోదు చేసిన నేపథ్యంలో- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డర్లకు తీపి కబురు ఇచ్చింది. ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ.7.10 పైసల మేర డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా ఇవ్వాళ ఎస్బీఐ షేర్ ధర రూ.472.90 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.