ఆన్లైన్ చెల్లింపులు అదుర్స్, 50 శాతం పెరిగిన ట్రాన్సాక్షన్స్
గ్రాసరీస్, యుటిలీటీ బిల్స్, ఇన్సురెన్స్ ప్రీమియం వివిధ చెల్లింపులకు ఆన్లైన్ వినియోగం 50 శాతం మేర పెరిగినట్లు SBI కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది యూపీఐ పేమెంట్ యాప్స్, ఆన్లైన్ చెల్లింపులకు మొగ్గు చూపుతోన్న విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా ఈ చెల్లింపులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎస్బీఐ కార్డ్ ద్వారా జరిగే చెల్లింపుల్లో ఇదివరకు ఆన్ లైన్ చెల్లింపులు 44 శాతం కాగా, ఇప్పుడు 53 శాతాన్ని తాకాయి.
నేటి నుండి 4 రోజులు SBI బంపరాఫర్, భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్

కరోనా ఎఫెక్ట్.. మరింత పెరగొచ్చు
కరోనా వైరస్ నేపథ్యంలో బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. దీంతో ఆన్లైన్ చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారు. నిత్యావసర వస్తువులు, ఇతర ఉత్పత్తులను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కరెంట్, డీటీహెచ్, కేబుల్ టీవీ వంటి యుటిలిటీ బిల్స్‌తో పాటు ఇన్సురెన్స్ ప్రీమియం కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఆన్ లైన్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో రామ్మోహన్ రావు.

ప్రజల కొనుగోలు ప్రవర్తనపై...
మున్ముందు ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరుగుతాయని చెప్పారు. ఒకసారి ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడితే కరోనా అనంతరం కూడా వాటికే మొగ్గు చూపుతున్నారన్నారు. అయితే ఇది ప్రజల కొనుగోలు ప్రవర్తనపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయం చెప్పలేమన్నారు. దుకాణాలు, మాల్స్ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే పీఓఎస్ చెల్లింపులు పుంజుకుంటాయని ఎస్బీఐ కార్డ్ భావిస్తోంది.

చిన్న చిన్న నగరాలు కూడా..
కరోనాకు ముందు వరకు ఆన్లైన్ చెల్లింపుల్లో మెట్రో నగరాలది పెద్ద పాత్ర. కానీ కరోనా అనంతరం సీన్ మారిపోయింది. చిన్న చిన్న నగరాల్లో వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొత్తగా చేరుతున్న ఖాతాదారుల్లో 58 శాతం మంది నాన్ మెట్రో నగరాల నుండి వస్తున్నారు. రోజుకు సగటున కరోనాకు ముందుస్థాయిలో వలె 10వేల మంది కొత్త ఖాతాదారులను సంపాదిస్తున్నట్లు తెలిపారు.