టీసీఎస్‌పై న్యాయ పోరాటం, ఏడేళ్ల తర్వాత ఫుల్ శాలరీతో ఉద్యోగం
ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు షాక్ తగిలింది. లే-ఆఫ్‌లో భాగంగా ఏడేళ్ల క్రితం ఓ ఉద్యోగిని తొలగించింది. అతను కోర్టు మెట్లు ఎక్కాడు. ఏళ్ల తర్వాత అతనిని ఉద్యోగంలోకి తీసుకోవాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2015లో ఈ సంఘటన జరిగింది. గ్రూప్ లే-ఆఫ్‌లలో భాగంగా చెన్నైకి చెందిన టెక్కీ తిరుమలాయి ఉద్యోగం పోయింది. అతను ఈ తొలగింపుపై కోర్టుకు వెళ్లాడు. అతను టీసీఎస్‌లో మేనేజ్మెంట్ స్థాయిలో ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాడు. అయితే అప్పుడు లేఆఫ్‌లో భాగంగా ఆయన పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదని తొలగించింది.
అతను మేనేజ్మెంట్ క్యాడర్లో పని చేశారని, వర్క్‌మెన్ కేటగిరీలోకి రారని టీసీఎస్ పేర్కొంది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశాడు. నాలుగేళ్ల పాటు తన కోర్ సెక్టార్లో పని చేశాక, 2001లో సాఫ్టువేర్ రంగంలోకి వచ్చాడు. టీసీఎస్‌లో అసిస్టెంట్ సిస్టమ్స్ ఇంజినీర్‌గా 2006లో నియమితులయ్యారు.

దీనిపై ఆయన కోర్టుకు వెళ్లి, 150 సార్లు అటెండ్ అయ్యారు. చివరకు చెన్నై కోర్టులో ఆయనకు ఊరట దక్కింది. సర్వీసులో తిరిగి నియమించుకోవడంతో పాటు 2015 నుండి ఇప్పటి వరకు వేతనం, ఇతర బెనిఫిట్స్ అందించాలని ఆదేశించింది. అతను ప్రాథమికంగా స్కిల్డ్ వర్కర్ అని కోర్టు పేర్కొన్నది. అయితే 2015లో ఉద్వాసనకు గురవడంతో అతను సాఫ్టువేర్ ప్రాజెక్టులపై ప్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పని చేశారు. టీసీఎస్‌లో ఉద్యోగం కోల్పోయాక ఆయన ఆదాయం తగ్గింది.