Navi Technologies IPO: ఫ్లిప్‌కార్ట్ మాజీ బాస్ కంపెనీ నుంచి పబ్లిక్ ఇష్యూ
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ నెలకొల్పిన మరో కంపెనీ- పబ్లిక్ ఇష్యూకు రాబోతోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను జారీ చేయడం ద్వారా 3,350 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని ఆ కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐపీఓను జారీ చేయడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ అనుమతి కోరింది. తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌ను సెబికి సమర్పించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ..భారత్ నుంచి రష్యా ఆశిస్తోన్న సహకారం ఇదే
అదే- నవీ టెక్నాలజీస్. ఈ కంపెనీలో సచిన్ బన్సల్.. 4,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు. ఐపీఓ సందర్భంగా తన స్టేక్స్‌ను డైల్యూట్ చేయట్లేదని ఈ డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో స్పష్టం చేశారు. ఈ ప్రాస్పెక్టస్‌కు సెబి నుంచి అనుమతులు లభిస్తే- ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం కాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నెలలో అంటే జూన్‌లో ఈ నవీ టెక్నాలజీస్ ఐపీఓను జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా సమీకరించుకోదలిచిన 3,350 కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని- తన సబ్సిడయరీస్ సంస్థలైన నవీ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్‌కు మళ్లిస్తామని ఈ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. మిగిలిన మొత్తాన్నీ తమ కార్పొరేట్ వ్యవహారాల కోసం వినియోగిస్తామని వివరించింది. సచిన్ బన్సల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగట్లేదు. అందులో నుంచి బయటికి వచ్చిన తరువాత అంకిత్ అగర్వాల్‌తో కలిసి ఆయన నవీ టెక్నాలజీస్‌ను నెలకొల్పారు.
నవీ టెక్నాలజీస్ అనేది- ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ. పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, జనరల్ ఇన్సురెన్స్, మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్లో రాణిస్తోంది. అలాగే- చైతన్య బ్రాండ్ కింద మైక్రోఫైనాన్స్ లోన్స్‌ను కూడా మంజూరు చేస్తోందీ కంపెనీ. కాగా పబ్లిక్ ఇష్యూ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ అండ్ యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూయిస్సె సెక్యూరిటీస్, ఈడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను నియమించినట్లు నవీ టెక్నాలజీస్ పేర్కొంది.