ఉక్రెయిన్‌తో యుద్ధం, అమెరికా ఆంక్షలతో కరెన్సీ పతనం: పుతిన్ కీలక నిర్ణయం
రష్యా-ఉక్రెయిన్ దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి. ఇరుదేశాలు చర్చలకు సిద్ధపడిన నేపథ్యంలో రష్యా అగ్రిమెంట్ కోసం, ఉక్రెయిన్ తక్షణ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పైన రష్యా బీకర దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా పుతిన్ పైన ఒత్తిడి పెరిగింది. అమెరికా, యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేశాయి. తాజాగా స్విఫ్ట్ నుండి రష్యాను తొలగించింది. దీంతో వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

పుతిన్ దూకుడు
స్విఫ్ట్ నుండి అమెరికా, యూరోపియన్ దేశాలు తొలగించడంతో అమెరికా డాలర్ మారకంతో రష్యా రూబుల్ క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే గత శుక్రవారం 84 వద్ద ఉన్న రూబుల్ నేడు 30 శాతం క్షీణించి 105.27 వద్ద ట్రేడ్ అయింది. ఈ నేపథ్యంలో పుతిన్ దూకుడైన నిర్ణయం తీసుకున్నారు. రూబుల్ పతనాన్ని అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం 9.5 శాతంగా ఉన్న బ్యాంకు రేటును 20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది రష్యన్ పొదుపు చర్యలకు ముప్పు కలిగిస్తుంది. రష్యా వద్ద ఉన్న 640 బిలియన్ డాలర్ల కరెన్సీ నిల్వలపై ప్రభావం పడితే ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్విఫ్ట్ ఆంక్షల కారణంగా సగం నిల్వలపై ప్రభావం పడవచ్చునని అంచనా.

2003 తర్వాత గరిష్టం
రష్యా 9.5 శాతం నుండి 20 శాతానికి వడ్డీ రేటు పెంచడం అంటే 2003 తర్వాత ఇదే గరిష్టం. పాశ్చాత్య ఆంక్షల ప్రభావం నుండి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో భాగంగా మూలధన ప్రవాహంపై కొన్ని నియంత్రణలు విధించింది. మాస్కో ఎక్స్చేంజీలో విదేశీయుల వద్ద ఉన్న సెక్యూరిటీలను విక్రయించకుండా బ్రోకర్లను తాత్కాలికంగా నిషేధించింది.

రష్యా కేంద్ర బ్యాంకు చర్యలు
రష్యా కేంద్ర బ్యాంకు కూడా చర్యలు తీసుకుంటోంది. బ్యాంకుకు అధిక నగదు నిల్వలను సమకూర్చాలని నిర్ణయించింది. బ్యాంకుల కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలను సులభతరం చేసింది. విదేశీయులు ప్రభుత్వ ఆబ్లిగేషన్లను విక్రయించకుండా నిషేధించింది. ప్రజలు తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ ఆదాయంలో 80 శాతాన్ని విక్రయించాలని ఆదేశించింది. రూబుల్ కొనుగోలు చేయాలని పేర్కొంది. కాగా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. ఒక్కరజోులో రష్యన్లు 1.3 బిలియన్ డాలర్ల నగదును ఉపసంహరించుకున్నారు.