ఆగస్ట్ 2019 తర్వాత రూపాయి దారుణ పతనం, ఒక్కరోజులో 105 పైసలు డౌన్
దేశీయ కరెన్సీ రూపాయి నిన్న (ఏప్రిల్ 7) భారీగా పతనమైంది. డాలర్ మారకంతో బుధవారం ఒక్కరోజే 105 పైసలు క్షీణించింది. గత 20 నెలల ఇంతస్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్ మారకంతో 74.47కు పడిపోయింది. 2019 ఆగస్ట్ తర్వాత ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. నాడు ఆగస్ట్ 5న (2019) రూపాయి చరిత్రలో భారీ నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 13వ తేదీ తర్వాత ఇది కనిష్ట ముగింపు.
బుధవారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 73.52 వద్ద ప్రారంభమై ఆ స్థాయి నుండి 74.50 పరిధిలో ట్రేడ్ అయింది. చివరికి 105 పైసల నష్టంతో 74.47 వద్ద ముగిసింది. ఆర్బీఐ రెపోరేట్లను యథాతథంగా కొనసాగించడంతో పాటు ఇటీవల చారిత్రక గరిష్ఠస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆర్థిక రికవరీపై అస్థిరత కనిపిస్తుందనే వ్యాఖ్యలు రూపాయిపై ప్రభావం చూపాయి.
రాబోయే రెండు సెషన్లలో రూపాయి 73.70 నుండి 74.75 పరిధిలో కదిలే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆర్బీఐ కీలక వడ్డీరేట్లని యథాతథంగా నిర్ణయించడం, ద్రవ్యవిధానంలో సరళ వైఖరి కొనసాగిస్తామని ప్రకటించడం ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. వడ్డీరేట్ల ప్రభావానికి లోనయ్యే బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాక్స్ మద్దతుతో కీలక సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 460.37 పాయింట్ల లాభంతో 49,661 వద్ద, నిఫ్టీ 135.55 పాయింట్లు లాభపడి 14,819 పాయింట్ల ముగిసింది.